
జాతి పునర్నిర్మాణంలో విద్యార్థులే కీలకం
నారాయణపేట రూరల్: జాతి పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని బిజ్వార్ పీఠం స్వామీజీ ఆదిత్య పరాశ్రీ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏబీవీపీ పాలమూరు విభాగ్ నిర్వహించిన అభ్యాసవర్గకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందించేందుకు విద్యాసంస్థలతో పాటు ఏబీవీపీ కృషి చేస్తోందన్నారు. విద్యా విధానంలో సంస్కృతాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. విదేశీయుల దండయాత్రతో దేశ సంస్కృతి ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్ల భాషను నేర్చుకోవడంతో పాటు మాతృభాషను విస్మరించరాదని.. కంప్యూటర్, ఖగోళశాస్త్రంపై దృష్టి సారించాలని సూచించారు. ఉన్నత చదువుల తర్వాత ఇతర దేశాలకు వెళ్లకుండా సొంత ప్రాంతానికి సేవ చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం తెలంగాణ ప్రాంత సహ సంఘటన మంత్రి విష్ణువర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరుణాకర్, సంయుక్త కార్యదర్శి నరేష్తేజ్, నరేంద్ర, పృథ్వి, జిల్లా కన్వీనర్ నరేష్, మహిళా ఇన్‌చార్జ్ రేణుక, సంఘం నాయకులు పాల్గొన్నారు.