
సర్దుబాటు సమంజసమేనా..?
నారాయణపేట రూరల్: ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు సర్కారు బడులకు తమ పిల్లలను పంపిస్తే బోధనా సిబ్బంది లేక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఉపాధ్యాయుల కొరత మరింత ఎక్కువైంది. దీంతో పిల్లల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల కేటాయింపు లేక కనీసం వలంటీర్ల నియామకం చేపట్టక చాలా చోట్ల పాఠ్యాంశాల బోధనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. క్రమబద్దీకరణ పేరుతో తక్కువ విద్యార్థుల అరకొర పాఠశాలల్లో ఉపాధ్యాయులను తొలగించి ఇతర పాఠశాలలకు పంపిన విద్యాశాఖ ఎక్కువ మొత్తంలో విద్యార్థులు కల్గిన పాఠశాలల్లో అందుకు తగిన నిష్పత్తిలో టీచర్ల నియామకం చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల సర్దుబాటు పేరుతో కొందరు టీచర్లను ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్‌పై కేటాయించగా, కొన్ని చోట్ల విధుల్లో చేరారు. మరికొన్ని చోట్ల రాజకీయ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో డీఈఓ ఆదేశాలను బేఖాతరు చేస్తు పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. జిల్లాలో ఇటీవల ఒక సారి బదిలీలు, రెండుసార్లు పదోన్నతులు కల్పించడంతో ప్రాథమిక పాఠశాలలు, మారుమూల గ్రామీణ బడుల్లో టీచర్ల కొరత తీవ్రమైంది. దీనికితోడు చాలా చోట్ల పదవీవిరమణ పొందిన, మృతిచెందిన టీచర్ల స్థానంలో కొత్త వారు చేరలేదు. దీంతో జిల్లాలో వందల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
సమస్య ఉన్న చోట నుంచే సర్దుబాటు
వాస్తవానికి జిల్లాలో విద్యార్థుల, ఉపాధ్యాయుల నిష్పత్తి పరిశీలిస్తే ఇతర జిల్లాల కంటే చాలా ఎక్కువ ఉంది. టీచర్ల కొరత తీర్చేందుకు ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిలో సర్దుబాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దాదాపు 90శాతంపైగా స్కూళ్లలో ఉపాధ్యాయులు అవసరం ఉంది. అయితే వాటి నుంచి టీచర్లను ఎంపిక చేసి మరో పాఠశాలకు డిప్యూటేషన్ ఇస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తి చేసి డీఈఓ కార్యాలయంలో అందించారు. ఇక ఆయా గ్రామాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో పాటు వినతిపత్రాలు, రాజకీయ నాయకుల ఒత్తిడులు వస్తున్నాయి. టీచర్లకు స్థానచలనం కల్పి ంచకుండా వలంటీర్లను ఇవ్వాలని కోరుతున్నారు.
మచ్చుకు కొన్ని..
● ఊట్కూరు మండలం చిన్నపొర్ల ప్రాథమిక పాఠశాలలో 180 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ పని చేస్తున్న హెచ్‌ఎం రిటైర్డ్ కాగా, మరో ఇద్దరు పదోన్నతిపై వెళ్లారు. ఒకరు స్పౌస్ బదిలీ చేసుకోగా మరొకరు ఎడ్యుకేషన్ లీవ్‌లో వెళ్లారు. చివరికి ఒకే ఉపాధ్యాయురాలు విద్యాబోధన చేస్తున్నారు.
● మరికల్ మండలం అప్పంపలిలో 40 మంది విద్యార్థులకుగాను ముగ్గురు ఎస్జీటీలు, ఒక స్కూల్ అసిస్టెంట్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇద్దరిని సర్దుబాటు చేయాల్సి ఉన్నా ఒకరితోనే సరిపెట్టారు.
● మరికల్ మండలం పెద్దచింతకుంట ప్రాథమిక పాఠశాలలో 54 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు సరిపోతారు. అయితే ఇక్కడ ఒక పీఎస్ హెచ్‌ఎంతో పాటు నాలుగు ఎస్‌జీటీలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడి నుంచి ఏ ఒక్కరిని కూడా డిప్యూటేషన్ ఇవ్వలేదు.
● మాగనూర్ మండలం కొత్తపల్లి యూపీఎస్ స్కూల్‌లో 282మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 12 పోస్టులు మంజూరు కాగా ఆరుగురు టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆ స్కూల్‌లో ప్రాథమిక తరగతుల్లో 190 మంది విద్యార్థులు ఉంటే వారికి 7మంది ఎస్‌జీటీలు ఉండాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. వారిలో ఒకరిని డిప్యూటేషన్ ఇచ్చారు.
● మక్తల్ మండలం తిర్మలాపూర్ పీఎస్‌లో 51మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. ఒకరిని చందాపూర్‌కు పంపించారు. ఒకే టీచర్ ఐదు తరగతులకు బోధించడం కష్టంగా ఉంది.
● నారాయణపేట మండలం బొమ్మన్‌పాడు పీఎస్‌లో బడిబాటలో 53మంది చేరారు. 173మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులే పనిచేస్తున్నారు.
టీచర్లను కేటాయించాలి
మా పాఠశాలలో ఇటీవల పదోన్నతితో ఇద్దరు టీచర్లు ఇతర పాఠశాలలకు వెళ్లారు. ఎనిమిది తరగతులకు ముగ్గురు టీచర్లు మాత్రమే ఉన్నారు. దీంతో చదువు చెప్పడానికి ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారింది. వెంటనే ఇద్దరు రెగ్యూలర్ టీచర్లతో పాటు మరో ఇద్దరు వలంటీర్లను కేటాయించాలి.
– భానుతేజ, విద్యార్థి, మద్దెల్‌బీడ్.
అవసరం మేరకు సర్దుబాటు
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న విద్యార్థులను బేరీజు వేసుకుని అత్యవసరమైన చోటికి టీచర్లను డిప్యూటేషన్‌పై పంపించాం. త్వరలో ప్రభుత్వం అకాడమిక్ ఇన్‌స్టక్టర్లను నియమించనుంది. జిల్లాలో 284మందికి ప్రతిపాదనలు పంపించాం. తప్పకుండా అవసరమైన చోట ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. బదిలీలపై ఇచ్చిన ఆదేశాల ప్రకారం టీచర్లు వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధుల్లో చేరాలి. లేకపోతే శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం.
– గోవిందరాజు, డీఈఓ
ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య
ప్రాథమిక పాఠశాలల్లో అరకొరఉపాధ్యాయులతో సమస్య తీవ్రం
మూడు నెలలైన వలంటీర్లనియామకం లేని వైనం
వర్క్ అడ్జెస్ట్‌మెంట్ పేరుతో టీచర్ల డిప్యూటేషన్‌లో తడబాటు

సర్దుబాటు సమంజసమేనా..?