
ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం
నారాయణపేట/మక్తల్: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మక్తల్‌లోని మంత్రి కార్యాలయంలో ఆమె చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సంఘసేవకురాలిగా, భూమి, సాయుధ రైతాంగ పోరాటంలో ప్రదర్శించిన పోరాటపటిమతో వీరవనితగా చరిత్రలో నిలిచి ప్రతిఒక్కరికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధపోరాటంలో దొరలు, రజాకార్ల దురాగాతాలను ఎదిరించిన గొప్ప వీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ సాయుధరైతాంగ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచి మహిళాశక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్పవీరవనిత అన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మారెడ్డి, గణేష్‌కుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి, ఫయాజ్, రంజిత్‌కుమార్‌రెడ్డి, కోళ్ల వెంకటేష్, కట్టసురేస్, కట్టవెంకటేష్ పాల్గొన్నారు.
ఆదర్శప్రాయురాలు..
తమ హక్కుల కోసం ఎలుగెత్తి చాటిన సాహస వీరనారి ఐలమ్మ అని, ఆమెను ఆదర్శంగా తీసుకుని ఆశయ సాధనకు కృషిచేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేందర్ గౌడ్ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రజావాణి సమావేశపు మందిరంలో బుధవారం చాకలి ఐలమ్మ చిత్ర పటానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిద కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారులు, ఉద్యోగులు, రజక సంఘం జిల్లా నాయకులు,వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.