
యూరియా.. ఏదయా?
● తెల్లవారుజామున నుంచే క్యూలైన్‌లోనే రైతులు ఎదురుచూపులు
● కొందరికే టోకెన్లు దక్కడంతో నిరాశతో వెనుదిరిగిన వైనం
నారాయణపేట రూరల్/నారాయణపేట టౌన్/
నర్వ/దామరగిద్ద: యూరియా కొరత రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది. గ్రామాల్లోని రైతు వేదికలో యూరియా బస్తాలు అందిస్తామని ప్రకటించడంతో గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచే అన్నదాతలు వరుస కట్టారు. నారాయణపేట మండలంలోని కోటకొండ గ్రామంలో వరసలో నిలబడిన రైతులు కలిసి పాస్ పుస్తకాలను వరుసలో పెట్టి పక్కకు వెళ్లి సేదతీరారు. లోడ్ 300 బస్తాలు మాత్రమే రాగా రైతులు మాత్రం పెద్ద ఎత్తున తరలిరావడంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తా చొప్పున పంపిణీ చేశారు. యూరియా రానివారు నిరాశతో వెనుదిరిగారు. మరో లోడు తెప్పించి రెండు రోజుల్లో అందిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
● నారాయణపేట మినీ స్టేడియంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి వర్షంలోనే తడుస్తూ రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. మండలంలోని పలు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. గంటల తరబడి నిలబడి ఒకరికి ఒక టోకెన్, బక బస్తా యూరియా ఇవ్వడం ఎంత వరకు సమంజసమని పలువురు రైతులు ప్రశ్నించారు. ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను సముదాయించి జిల్లా కేంద్రంలో నాలుగు క్లస్టర్లుగా పలు గ్రామాల వారికి ఏర్పాటు చేసి యూరియా అందజేశారు.
● నర్వ పీఏసీఎస్‌తో పాటు మన గ్రోమర్, నర్వలోని రెండు ప్రైవేటు, రాయికోడ్‌లోని ఓ ప్రైవేటు క్రిమిసంహారక దుకాణాలకు యూరియా రాగా.. రైతులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ సందర్భంగా పోలీస్‌లు అక్కడికి చేరుకోని రైతులకు క్రమ పద్దతిలో యూరియా అందేలా చర్యలు చేపట్టారు. రైతులు ఎలాంటి అధైర్యపడాల్సిన పనిలేదని, సరిపడా యూరియా ప్రభుత్వం అందిస్తుందనిఏఓ అఖిలారెడ్డి పేర్కొన్నారు.
● దామరగిద్దలో తెల్లవారుజాము నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఏఓ మణిచందర్ సమక్షంలో రెండు రోజుల క్రితం టోకన్ అందుకున్న రైతులకు యూరియా అందజేశారు. కాగా మిగిలిన రైతులకు టోకన్‌లను అందజేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ రాజు సమక్షంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.

యూరియా.. ఏదయా?