
పదవీ గండం?
కొత్త నిబంధనలతో పీఏసీఎస్ పాలకవర్గాల్లో ఆందోళన
కోస్గి: వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లకు సంబంధించిన పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 14తో ముగిసింది. పాలకవర్గాల పదవీ కాలాన్ని రెండోసారి ప్రభుత్వం మరోమారు పొడిగించింది. ఇప్పటికే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో గ్రామ పంచాయతీల్లోనూ, మున్సిపాలిటీల్లో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించి పాలన కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 6 నెలలపాటు పొడిగించిన పీఏసీఎస్‌ల పదవీ కాలం సైతం ఆగస్టు 14తో ముగియడంతో ప్రభుత్వం పీసీసీఎస్‌లతోపాటు డీసీసీబీ పాలకమండళ్ల పదవీ కాలన్ని సైతం పొడిగిస్తూ జీఓ 386 ను విడుదల చేసింది.
సర్వత్రా ఆందోళన
పదవీ కాలం పొడిగించిన ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాలకవర్గాల్లో ఎవరైన పీఏసీఎస్ చైర్మన్ గాని, డైరెక్టర్ గాని రుణాలు తీసుకొని చెల్లించని పక్షంలో, నిధుల దుర్వినియోగంలో ప్రమేయం ఉన్న పాలకవర్గ ప్రతినిధులు, డైరెర్టర్లను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో కొన్ని పీఏసీఎస్ పాలకవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. జిల్లా అధికారులు బకాయిలు ఉన్న డైరెక్టర్లు, నిధుల దుర్వినియోగం చేసిన వారికి ముందస్తుగా నోటీసులు జారీ చేయడంతోపాటు సంబంధిత వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. కాగా ఇప్పటికే నోటీసులు అందుకున్న డైరెక్టర్లు తమ బకాయిలను చెల్లించి పదవి గండం నుంచి తప్పించుకున్నారు. జిల్లాలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఇద్దరు చైర్మన్లతోపాటు ఓ పీఏసీఎస్ కార్యదర్శిపై విచారణ కొనసాగుతుంది. ఒకవేళ ఏదేని సొసైటీకి పాలకవర్గం రద్దయితే ప్రత్యేక అధికారిని నియమించనున్నారు.
పొంతన లేకుండా డీసీఓ సమాధానాలు
పాలకవర్గాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఉత్తర్వుల విషయమై ఇన్‌చార్జ్ డీసీఓ శంకరాచారిని అడగగా.. ఉత్తర్వులు వచ్చిన మాట వాస్తవమేనని, జిల్లాలో అలాంటి కేసులు లేవని, నోటీసులు ఇచ్చి తీసుకున్న రుణాలు వసూలు చేశామని, ఎమ్మెల్యేలు, కడా అధికారి చెప్పడంతో వారిని కొనసాగిస్తున్నామంటూ పొంతన లేని సమాధానం ఇచ్చారు. నిధుల దుర్వినియోగంతోపాటు బకాయిలు ఉన్న డైరెక్టర్ల సమగ్ర వివరాలు అడగగా అలాంటిదేమి లేదు అంతా ఓకే ఉంది, ఇంకేమి అడగొద్దు అంటూ ఫోన్ పెట్టేశారు.
జిల్లాలో 10 పీఏసీఎస్‌లు..
130 మంది డైరెక్టర్లు
జిల్లాలో 13 మండలాలు, 276 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా మొత్తానికి ఒక డీసీసీబీ, ఒక డీసీఎంఎస్‌తోపాటు నారాయణపేట జిల్లాలో 10 పీఏసీఎస్‌లు ఉండగా మొత్తం 130 మంది డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు చైర్మన్లు, ఓ కార్యదర్శి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధనలతో పాలకవర్గాలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత ఉన్న సంఘాల వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపించే పనిలో ఉన్నారు.
రుణాలు చెల్లించని, నిధుల దుర్వినియోగం కేసులున్న వారి పదవులకు ఎసరు
పదవీ కాలం పొడగిస్తూనే నిబంధనలతో ప్రభుత్వం మరో జీఓ విడుదల
జిల్లాలోని 10 పీఏసీఎస్‌ల్లో ఇద్దరు చైర్మన్లకు పదవీ గండం..?

పదవీ గండం?