
మానవ అక్రమ రవాణాను నిర్మూలించాలి
నారాయణపేట రూరల్: మానవ అక్రమ రవాణా నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డీఈఓ గోవిందరాజు అన్నారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక కేజీబీవీ పాఠశాలలో నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన డిఈఓ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తుందని, ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న నేరపూరితమైన చర్యను అడ్డుకునేందుకు చైతన్యం పెరగాలన్నారు. పేద, మధ్య తరగతి అమ్మాయిలు, మహిళలు ఎక్కువ గా గురి అవుతున్నారని, సమాజంలో ప్రజలతో, విద్యార్థులతో సన్నిహితంగా ఉండి గమనించి వారికి అవగాహన కల్పించాలని, పేరెంట్స్ మీటింగ్స్ చర్చించి సూచనలు చేయాలన్నారు. చిన్నతనం నుంచి ఫోన్ ఉపయోగించడం తగ్గించాలని, యాప్ ల ద్వారా పర్సనల్ ఫొటోస్ వీడియోస్ పంపడం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం సైబర్ ఆధారిత అక్రమ రవాణా చట్టాలు, సఖి భరోసా కేంద్రాలు, చైల్డ్ లైన్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్స్ 1098, 100, 181, 1930, 181లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిసిడిఓ నర్మద, సంఘం కోఆర్డినేటర్ అంబర్ సింగ్, సిబ్బంది కృష్ణవేణి, నవనీత పాల్గొన్నారు.