
పేట–కొడంగల్ ఎత్తిపోతలకు వ్యతిరేకం కాదు
నారాయణపేట: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి బీఆర్‌ఎస్ వ్యతిరేకం కాదని.. ఈ పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ. 35లక్షల పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన జల్ల్లా కేంద్రంలో విలేకర్లతో మాట్లాడారు. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో జిల్లాలోని మక్తల్, ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద, మద్దూర్ మండలాలకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని.. మిగతా మండలాలకు చుక్కనీరు అందనప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీ ఈ ప్రాజెక్టుకు అడ్డు చెప్పడం లేదన్నారు. జిల్లాలోని అన్ని మండలాలకు ప్రయోజనం కలిగే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తే జిల్లా మొత్తం సస్యశ్యామలమవుతుందన్నారు. ఇప్పటికే 95శాతం పూర్తయిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
● బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్‌ను జిల్లా పార్టీ స్వాగతిస్తుందని రాజేందర్‌రెడ్డి అన్నారు. కొన్ని రోజులుగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయన్నారు. బీఆర్‌ఎస్ కుటుంబ పార్టీ అని పదేపదే చెబుకునే కాంగ్రెస్, బీజేపీలకు కవిత సస్పెన్షన్ ద్వారా ఇది కుటుంబ పార్టీ కాదని కనువిప్పు కలిగిందన్నారు. బీఆర్‌ఎస్ ఒక క్రమశిక్షణ గల పార్టీ అని.. ఇందులో తప్పు చేసినవారు ఎంతటి వారైనా పార్టీ నుంచి పక్కకు తప్పించడం జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా కేంద్రం సమీపంలోని కొండారెడ్డిపల్లి చెరువును ఆయన పరిశీలించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రూ. 4కోట్లతో కొండారెడ్డిపల్లి చెరువును సుందరంగా తీర్చిదిద్దగా.. ప్రస్తుతం అధ్వానంగా మారిందన్నారు. ఇప్పటికై నా చెరువు అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్‌చైర్మన్ కన్నా జగదీశ్, చెన్నారెడ్డి, నాయకులు ప్రతాప్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వేపూరి రాములు, విజయ్‌సాగర్, మహిమూద్ అన్సారీ తదితరులు ఉన్నారు.