
రైతులకు తప్పని యూరియా కష్టాలు
కొత్తపల్లి: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. బుధవారం కొత్తపల్లి మండలం భూనీడులోని ఎరువుల దుకాణం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. మండల వ్యవసాయశాఖ అధికారి రమేశ్, ఎస్‌ఐ విజయ్‌కుమార్ సమక్షంలో ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున యూరియాను పంపిణీ చేశారు. అయితే అరకొరగా యూరియా అందిస్తుండటంతో నిత్యం ఎరువుల విక్రయ కేంద్రాల వద్దకు రైతులు చేరుకొని పడిగాపులు కాయాల్సి వస్తోంది. వరిపంటకు అనువైన సమయంలో యూరి యా వేయకుంటే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని రైతులు వాపోతున్నారు. కాగా, ఉమ్మడి మద్దూరు మండలానికి ఇప్పటికే 1,063 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని.. ఒకట్రెండు రోజుల్లో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఏఓ రమేశ్ తెలిపారు.