
రిజర్వాయర్‌లో దంపతుల గల్లంతు
● చేపల వేటకు వెళ్లిన క్రమంలో చోటుచేసుకున్న ఘటన
● ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల గాలింపు.. ఎమ్మెల్యే, ఎస్పీ పరిశీలన
మల్దకల్: రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లిన భార్యాభర్తలు ప్రమాదవశాత్తు పుట్టి బోల్తా పడడంతో గల్లంతయ్యారు. ఈ ఘటన మల్దకల్ మండలం తాటికొండ రిజర్వాయర్‌లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాటికుంటకు చెందిన దుబ్బన్‌బోయి బోయ రాముడు(36), సంఽధ్య(34) భార్యభర్తలు. చేపలు పట్టుకొని విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. రోజులాగే మంగళవారం సాయంత్రం ఇరువురు చేపల వేటకు వెళ్లారు. రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే రిజర్వాయర్ వద్దకు చేరుకుని పరిశీలించగా అక్కడ రాముడు బైక్, చెప్పులు, వస్తువులు లభించడంతో ఇద్దరు రిజర్వాయర్‌లో చేపల కోసం పుట్టీలో వెళ్లారని గుర్తించారు. రిజర్వాయర్‌లో అలల తాకిడి ఎక్కువ కావడంతో పుట్టి బోల్తా పడి ఉండవచ్చునని గ్రామస్తులు తెలిపారు. భార్యకు ఈత రాకపోవడంతో ఆమెను రక్షించే క్రమంలోనే భర్త మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మంగళవారం రాత్రి 11గంటల సమయంలో మల్దకల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు జిల్లా ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపారు. దీంతో బుధవారం ఉదయం గల్లంతైన వారి కోసం 50మందితో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం రిజర్వాయర్‌లో గాలింపు చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగులయ్య, సీఐ శ్రీను అక్కడికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. చేపల వేటకు ఎప్పుడు వెళ్లారు, పూర్తి వివరాలను కుటుంబ సభ్యులు, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలాఉండగా, వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాయంత్రం వెళ్లిన తల్లిదండ్రులు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆ చిన్నారుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.
గల్లంతైన భార్యాభర్తలు రాముడు, సంధ్య (ఫైల్)
అన్నివిధాలుగా ఆదుకుంటాం.. : ఎమ్మెల్యే
బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వారి కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అందే రైతు బీమాతోపాటు ఇద్దరు చిన్నారులకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ఇద్దరి ఆచూకీ తెలిసే వరకు గాలింపు చర్యలు చేపడతామని ఆయనతోపాటు అధికారులు తె లిపారు. గాలింపు చర్యల్లో తహసీల్దార్ ఝాన్సీరాణి, గట్టు ఎస్‌ఐ మల్లేష్, ఆర్‌ఐ మద్దిలేటి, మహేందర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

రిజర్వాయర్‌లో దంపతుల గల్లంతు

రిజర్వాయర్‌లో దంపతుల గల్లంతు

రిజర్వాయర్‌లో దంపతుల గల్లంతు