
నిరసన సెగలు!
‘పేట – కొడంగల్’ భూసేకరణ సర్వేకు అడ్డంకులు
●
ప్రభుత్వాల నిర్లక్ష్యమే
ప్రభుత్వాలు భూ నిర్వాసితులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నాయి. గత ప్రభుత్వాల కంటే మేం ఎక్కువగా డబ్బులు ఇస్తున్నామని చెప్పడమే తప్పా నిర్వాసితులకు న్యాయం జరగడం లేదు. రైతులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా నిలుస్తూ పోరాటాన్ని కొనసాగిస్తాం.
– వెంకట్రామరెడ్డి, భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు
జీవనోపాధి పోతుంది
వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. అలాంటి భూములను ప్రభుత్వం కోరితే ఇస్తున్నాం. భూమి ఉంటే తమకు రైతు భరోసా. భీమా, బ్యాంకు రుణం, పీఎం కిసాన్ వచ్చే వాటన్నింటిని ఈ రోజు కోల్పోవాల్సి వస్తుంది.
– మశ్చందర్,
భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షులు
అర ఎకరా రాదు
ఎకరాకు రూ.14లక్షలు ప్రభుత్వం పరిహారం ఇస్తే ఈ రోజు మార్కెట్‌లో అర ఎకరా భూమి కొనలేని పరిస్థితి. సమాజం కోసం భూమి త్యాగం చేస్తే న్యాయపరమైన పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉంది. రైతులపక్షాన పోరాడుతేనే ఉంటాం.
– డాక్టర్ రఘవేందర్ గౌడ్,
భూ నిర్వాసితుడు, ఊట్కూర్
రైతులు సహకరించాలి
రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి ప్రాజెక్టు కింద భూములను అందజేసిన వారికి ప్రభుత్వం నుంచి భూ పరిహారం కింద ఎకరాకు రూ.14 లక్షలు ఇస్తున్నాం. రైతులు సహకరించి ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములు కావాలి.
– రాంచందర్‌నాయక్, ఆర్డీఓ
నారాయణపేట: సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం సర్వే పనులకు రోజు రోజుకు నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో రైతులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. రైతుల నుంచి నిరసన సెగలు తగులుతుండడంతో అధికారులు, పాలకులకు ప్రాజెక్టుకు కావాల్సిన భూసేకరణ కత్తిమీద సామైంది. తమకు భూ నష్టపరిహారం బహిరంగ మార్కెట్‌ను అనుసరించి ఇవ్వాలని రైతులు భూ నిర్వాసితుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం ఎకరానికి రూ.14 లక్షల పరిహారాన్ని చెల్లించేలా 141 మంది రైతులకు చెక్కులను అందజేసింది. అయితే తమకు ఈ ధర సరిపోదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.
డిమాండ్లు ఇవే
భూముల బేసిక్ ధర నిర్ణయించడానికి న్యాయమూర్తి అధ్వర్యంలో ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. నిర్ధారించిన బేసిక్ ధరకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలుపరచాలని, బలవంతపు భూసేకరణను ఆపడంతోపాటు భూ సేకరణకు ముందే భూ రికార్డులను సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు.
అడుగడుగునా నిరసనలు
నాలుగు మండలాల పరిధిలో 21 గ్రామాలకు చెందిన సుమారు 1500 మందికి పైగా రైతుల నుంచి 1957.39 భూమిని ప్రభుత్వం సేకరించే పనిలో పడింది. అయితే, తమ భూములకు న్యాయమైన పరిహారం ఇవ్వాలంటూ రైతులు సర్వేకు వెళ్లే ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే అధికారులను అడుగడుగున అడ్డుకుంటున్నారు. ప్రత్యేక పోలీసు బందోబస్తు మద్య భూ సర్వేలను చేపడుతున్నారు. మొదటి దశలో పంప్‌హౌస్, సబ్‌స్టేషన్ ప్రెజర్ మెయిన్ కాల్వకై 550 ఎకరాల భూమిని మక్తల్ మండలం కాట్రేవ్ పల్లి నుంచి దామరగిద్ద మండలం కానుకుర్తి వరకు సర్వే చేపట్టారు. ఆ తర్వాత సెకండ్ పేజ్‌లో జయమ్మ రిజార్వాయర్‌కు 337 ఎకరాలు, 3వ దశలో ఊట్కూర్‌రిజార్వాయర్‌కు 311 ఎకరాలు భూ సర్వే పూర్తి చేశారు. నాల్గో దశలో దామరగిద్ద మండలంలోని కానుకుర్తి రిజార్వాయర్‌కు కావాల్సిన 792 ఎకరాల భూసర్వేకు బుధవారం వెళ్లి అధికారులను రైతులు అడ్డుకున్నారు. దీంతో అక్కడికి ఆర్డీఓ రాంచందర్‌నాయక్, డీఎస్పీ లింగయ్య వెళ్లి రైతులను సముదాయించే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. సర్వేయర్లు, అధికారులను రైతులు తిప్పిపంపించారు. భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో గత 25 రోజులుగా జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు, నిరసనలు, కలెక్టరేట్ ఎదుట ధర్నా, రాస్తారోకోలు, గ్రామాల్లో సభలు చేపడుతున్నారు. సమాజంలో ‘న్యాయం బతకాలి– బతికించాలి‘ అని నిర్వాసితులు నినాదాలు చేస్తూ ప్రజలు కోరుకుంటున్నారు.
పరిహారం విషయంలో వెనక్కి తగ్గని భూనిర్వాసితులు
మార్కెట్ రేటు ప్రకారం ఇవ్వాలని ఆందోళన బాట
పోలీసుల భద్రత నడుమ సర్వే
చేపడుతున్న అధికారులు

నిరసన సెగలు!

నిరసన సెగలు!

నిరసన సెగలు!

నిరసన సెగలు!