
కార్యకర్తల సంకల్పం గొప్పది
అచ్చంపేట: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్‌కు ఓట్లు వేయలేదని.. ఇచ్చిన మోసపూరిత హామీలను నమ్మి ఓట్లేసి ఇప్పుడు ఎంతో బాధపడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అచ్చంపేటలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జరగగా ఆయనతోపాటు మాజీమంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు కేసీఆర్‌కు అండగా ఉన్నారని, ఇందుకు నిదర్శనం అచ్చంపేటలో నాయకుడు వెళ్లిన తర్వాత జరిగిన పరిణామాలేనని తెలిపారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత వారికే దక్కుతుందని విమర్శించారు. కరుడుగట్టిన కార్యకర్తల ఆదరణ ఉన్నా.. గువ్వల బాలరాజు లాంటి నాయకుడు పార్టీ మారడం అవివేకమని, ఓ రకంగా ఆయన పతనానికి ఆయనే కారణమయ్యారని విమర్శించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గువ్వల పార్టీ మారడం దురదృష్టకరమని, నాయకుడు కార్యకర్తలకు భరోసా కల్పించేలా ఉండాలన్నారు. రానున్నది బీఆర్‌ఎస్ పాలనేనని.. కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగమన్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ 28న అచ్చంపేటలో కేటీఆర్ సభ ఉంటుందని పేర్కొన్నారు.