
బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి
కోస్గి: ఖాతాదారుల సౌకర్యార్థం బ్యాంకులు ఎన్నో రకాలుగా ఆర్థిక సేవలను అందిస్తున్నాయని, ప్రజలు బ్యాంకులు కేవలం రుణాలు ఇవ్వడానికి, వడ్డీలు వసూలు చేయడానికి ఉన్నాయనే అపోహలు వీడి బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎస్‌బీఐ మేనేజర్ అనంతనాగ్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం మండలంలోని చెన్నారంలో జన్ సురక్ష అవగాహన కార్యక్రమంలో భాగంగా బ్యాంకు సేవలు, ఆర్దిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్యాంకులో ఖాతా ఉన్న వారందరికి నామమాత్రపు ప్రీమియంలో జీవిత బీమా సౌకర్యం కల్పిస్తుందన్నారు. మహిళా సంఘాల్లో మహిళా గ్రూపులు పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న ఉమ్మడి లోన్ లేదా ఇతర వ్యక్గిగత రుణాలుగాని సకాలంలో చెల్లించి బ్యాంకులకు సహకరించడంతోపాటు బ్యాంకులు అందించే రాయితీలు, ప్రొత్సాహకాలకు అర్హులవుతారన్నారు. అవసరం కోసం ఎంత బాధ్యతగా రుణాలు తీసుకుంటామో అంతే బాధ్యతగా రుణ బకాయిలు తిరిగి చెల్లించాలన్నారు. సకాలంలో రుణాలు చెల్లించే సంఘాలకు ప్రత్యేక గుర్తింపుతోపాటు వడ్డిలో సైతం ఎన్నో రాయితీలు ఉంటాయన్నారు. అనంతరం నగదు రహిత లావాదేవిలు, ఆన్‌లైన్, నెట్ బ్యాంకింగ్, సైబర్ నేరాలు, మోసపూరిత బ్యాంకు లావాదేవీలను గురించి సమగ్రంగా వివరించారు. ఇందులో ఆర్దిక అక్షరాస్యత కౌన్సిలర్ మల్లేష్, ఫీల్డ్ అధికారి యశ్వంత్‌రెడ్డి, బ్యాంకు సిబ్బంది అంజి పాల్గొన్నారు.