
సీఎం హామీ నిలబెట్టుకోవాలి
నారాయణపేట రూరల్: జీవో 69 కింద నిర్మిస్తున్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం విషయంలో భూ నిర్వాసితులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని భూ నిర్వాసితుల పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం కింద భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయమైన, ఆమోదయోగ్యమైన పరిహారం ఇవ్వలని కోరారు. రైతులకు 2013 భూసేకరణ చట్టానికి అనుగుణంగా, ప్రస్తుత మార్కెట్ ధరల మేరకు ఎకరాకు రూ.30 లక్షల నష్టపరిహారం, కుటుంబానికి ఉద్యోగం కల్పించాలని కోరారు. రిలే దీక్షలు 25వ రోజుకు చేరినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధుల్లో స్పందన లేకపోవడాన్ని ఆయన విమర్శించారు. రిజిస్ట్రేషన్ విలువల మేరకు పరిహారం ఇవ్వడం భూముల విలువను తీవ్రంగా తగ్గిస్తుందని తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి తక్షణమే స్పందించి పరిహారంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. రైతులు భూములు కోల్పోతే భవిష్యత్తులో రైతు భరోసా, రైతుబంధు, బ్యాంకు రుణాలు అన్ని కోల్పోవాల్సి వస్తుందని వివరించారు. మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి రైతులను పక్కదోవ పట్టించే మాటలు మాట్లాడడం సరికాదని, వేరువేరుగా ఉద్యమాలు చేసే విధంగా ప్రోత్సహించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నాయకులు మచ్చేందర్, గోపాల్, బాల్‌రాం, ధర్మరాజు పాల్గొన్నారు.
పెసర క్వింటాల్ రూ.8,559
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం పెసర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.8,559, కనిష్టంగా రూ.4,591 ధరలు పలికాయి. అలాగే, ఎర్ర కందులు గరిష్టం, కనిష్టంగా రూ.6,469 ధర పలికింది.
పాత అలుగుకు చేరిన కోయిల్‌సాగర్ నీటిమట్టం
దేవరకద్ర: కోయిల్‌సాగర్‌లో నీటిమట్టం పాత అలుగు స్థాయికి చేరుకుంది. ప్రాజెక్టు అలుగు స్థాయి నీటిమట్టం 26.6 అడుగులు కాగా.. శుక్రవారం సాయంత్రం వరకు అలుగు మట్టానికి నీరు చేరింది. ప్రాజెక్టు గేట్ల స్థాయి 32.6 అడుగులు కాగా.. మరో 6 అడుగుల నీరు చేరితే గేట్లను తెరిచే అవకాశం ఉంటుంది. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎడమ కాల్వను మూసివేయగా.. కుడి కాల్వలో నీటి విడుదల నిలిపివేసి సన్నగా ధారలా వదిలారు.