
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
ఊట్కూరు: పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని, గణేష్ ఉత్సవాలు, ఇతర అన్ని మతాల పండుగలకు డీజేలను అనుమతించేది లేదని ప్రజలు సహకరించాలని డీఎస్పీ ఎన్ లింగయ్య సూచించారు. శుక్రవారం గణేష్ ఉత్సవాల సందర్భంగా ఊట్కూర్ రైతు వేదిక భవనంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శాంతిభద్రతల పరిరక్షణలో బాగంగా మతపరమైన పండుగలు, ఊరేగింపుల సమయంలో శబ్దకాలుష్యం వచ్చే డీజే సిస్టమ్స్‌ను, బాణసంచారం వాడరాదని తెలిపారు. శబ్ద కాలుష్యం వల్ల వృద్దులకు, దీర్ఘకాలిక రోగులకు, చిన్నపిల్లలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ఉత్సవాలను శాంతియుతంగా సాంప్రదాయబద్దంగా నిర్వహించుకోవాలని కోరారు. ఎవరైన డీజేలను ఏర్పాటు చేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, వాటికి బదులుగా సౌండ్‌బాక్స్‌లు, సన్నాయి, కోలాటం, చెక్కభజన తదితర వాటిని వాడాలన్నారు. కార్యక్రమంలో సిఐ రామరాజ్, ఎస్‌ఐ రమేష్, ఉత్సవ కమిటి నాయకులు భాస్కర్, సూర్యప్రకాష్‌రెడ్డి, మహేష్‌రెడ్డి, షెట్టి రమేష్, శివప్రసాద్‌రెడ్డి, వడ్ల మోనప్ప, గౌతం తదితరులు పాల్గొన్నారు.