
‘కాళేశ్వరం’పై కాంగ్రెస్‌వి తప్పుడు ఆరోపణలు
నారాయణపేట: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం మాజీ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరించడాన్ని జిల్లా కేంద్రానికి సమీపంలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధులతో కలిసి తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని కాంగ్రెస్ భావిస్తే అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక్క అనుమ తి తీసుకు రాలేదన్నారు. అక్కడ ప్రాజెక్ట్ కడితే మహారాష్ట్ర నుంచి అభ్యంతరం ఉంటుందని తెలిసినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పనులు ప్రారంభించిందని ఆరోపించారు. కానీ సీఎం కేసీఆర్ కేంద్రం నుంచి 11అనుమతులు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేశారని కొనియాడారు.
రైతుల నోట్లో మట్టి కొడితే ఖబడ్దార్
జిల్లాలో చేపడుతున్న నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి డీపీఆర్ ఎక్కడుందని.. కొడంగల్‌లో ఇచ్చిన విధంగానే నష్ట పరిహారం నారాయణపేట, మక్తల్ నియోజవకర్గాలోని రైతులకు ఇవ్వాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన ఉద్యమిస్తామని ఎస్‌ఆర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మక్తల్‌లో మంత్రి, ఎమ్మెల్యే కలిసి సీఎం రేవంత్‌రెడ్డిపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. 95 శాతం పూర్తయిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కాల్వ పనులు ఎందుకు చేపట్టడం లేదన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అశోక్‌గౌడ్, గ్రంథాలయ మాజీ చైర్మన్ రామకృష్ణ, నాయకులు సుదర్శన్‌రెడ్డి, వేపూరి రాములు, సుధాకర్‌రెడ్డి, విజయ్‌సాగర్, కన్నా జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.