పీయూలో ఏం జరుగుతోంది? | - | Sakshi
Sakshi News home page

పీయూలో ఏం జరుగుతోంది?

Jul 23 2025 5:40 AM | Updated on Jul 23 2025 5:40 AM

పీయూలో ఏం జరుగుతోంది?

పీయూలో ఏం జరుగుతోంది?

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో ఉన్నతస్థాయి అధికారులు కిందిస్థాయి సిబ్బందిపై వేధింపుల పర్వానికి తెరలేపారు. గత కొన్నిరోజుల వ్యవధిలోనే ముగ్గురు సిబ్బందిపై సస్పెషన్‌ వేటు వేసి తమలోని అక్కసును బయటపెట్టుకున్నారు. దీంతో పాటు నాన్‌టీచింగ్‌ సిబ్బంది చేసే చిన్నపాటి తప్పిదాలకే విచారణ కమిటీలు వేసి భయాందోళనకు గురిస్తున్నారు. వేసవిలో యూనివర్సిటీకి సెలవులు ప్రకటించిన అధికారులు.. నాన్‌టీచింగ్‌ సిబ్బందికి మాత్రం ఒక్క సెలవు ఇవ్వలేదు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన సిబ్బందిని కనీసం అధికారులు వారి చాంబర్‌లోకి కూడా రానివ్వలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం తమకు వేతనాలు పెంచమని కోరినందుకే అణచివేత ధోరణికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీయూలో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న నాన్‌టీచింగ్‌ సిబ్బందిలో కిందిస్థాయి వారికి రూ.6 వేల నుంచి మధ్యస్థాయి వరకు రూ.15 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు.

టీచింగ్‌ సిబ్బందిలోనూ అసంతృప్తి..

పీయూలో ప్రొఫెసర్‌ స్థాయి లెక్చరర్లు ఉన్నప్పటికీ రిజిస్ట్రార్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసుకోవడంపై రెగ్యులర్‌ టీచింగ్‌ సిబ్బంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా గతంలో అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేసిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వకుండా వారిని దూరంగా పెట్టడం, సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

● ఇటీవల అన్ని హాస్టళ్లకు కలిపి ఒక రెగ్యులర్‌ అధ్యాపకుడిని చీఫ్‌ వార్డెన్‌గా నియమించారు. ఇందులో రెండు బాలికల హాస్టళ్లు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో బాలికల హాస్టల్‌కు గతంలో ఉన్న చీఫ్‌ వార్డెన్‌ (మహిళ)ను తప్పించి పురుష అధికారిని నియమించారు. బాలికల హాస్టల్‌లో సమస్యలు, ఇబ్బందులు వస్తే వారు ఆయనకు ఎలా చెప్పుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది.

బదిలీల పరంపర..

నాన్‌టీచింగ్‌లో రెగ్యులర్‌ ప్రతిపాదిక పనిచేస్తున్న అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌కు సైతం వేధింపులు తప్పలేదు. తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదని అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఆయనను ఎలాంటి కారణం చెప్పకుండా నేరుగా ఎగ్జామినేషన్‌ విభాగానికి బదిలీ చేశారు. అంతేకాకుండా మరో నాన్‌టీచింగ్‌ సిబ్బందిని సరిగా విధులకు రావడం లేదన్న కారణంతో ఫార్మసీ కళాశాలకు బదిలీ చేసి.. అక్కడి నుంచి గద్వాల పీజీ కళాశాలకు బదిలీ చేసి అక్కడి వెళ్లాలని సూచించారు. చాలా రోజులుగా వైస్‌ చాన్స్‌లర్‌ను కలిసి సమస్యను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే కనీసం చాంబర్‌లోకి సైతం రానివ్వలేదని తెలిసింది. అంతేకాకుండా మరో మహిళా సిబ్బందిని ఎలాంటి కారణం లేకుండా నేరుగా ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. గతంలో తప్పిదాలు చేసి బదిలీపై వెళ్లిన వారిని ప్రస్తుత అధికారులు పైరవీలు చేసి తిరిగి అడ్మినిస్ట్రేషన్‌ బ్రాంచ్‌కు రప్పించుకుంటున్నట్లు సమాచారం. మరో ఇద్దరిపై విచారణ కోసం కమిటీలు వేసి, వారి వివరణ సైతం తీసుకుంటున్నారు. ఇలాంటి ధోరణితో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.

నాన్‌ టీచింగ్‌ సిబ్బందిపై వేధింపుల పర్వం

ఇటీవల పలువురిపై సస్పెన్షన్‌ వేటు

చిన్నపాటి తప్పిదాలకే విచారణ కమిటీల ఏర్పాటు

వేతనాలపై ప్రశ్నిస్తున్నందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు

టీచింగ్‌ సిబ్బందిలో సైతం అధికారుల తీరుపై తీవ్ర అసహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement