
రూ.100 కోట్ల పంట రుణాలు
పాన్‌గల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది రూ.100 కోట్ల పంట రుణాలు ఇవ్వనున్నట్లు డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు సహకార బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలను సకాలంలో పునరుద్ధరించుకుంటే వడ్డీ తగ్గుతుందని.. దీనిని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. సహకార సంఘం పరిధిలో గ్రామానికి 10 మంది రైతులను ఎఫ్‌పీఓ ద్వారా వ్యాపారాలు, ఆహార ఉత్పత్తులు పెంచేందుకు సభ్యులుగా చేర్చుతామని.. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ సాగు ఉత్పత్తులు పెంచుతామన్నారు. పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక, వ్యవసాయేతర రుణాలను కూడా అందిస్తున్నామని.. కర్షకమిత్ర ద్వారా 2 నుంచి 4 ఎకరాలున్న రైతులకు ఎకరాకు రూ.4 లక్షల చొప్పున మార్టిగేజ్ రుణాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పాన్‌గల్ సింగిల్‌విండో ద్వారా రైతులకు రూ.కోటి వరకు రుణాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు సరఫరా చేస్తామని తెలిపారు. ముఖ్యంగా రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని అపోహలను నమ్మవద్దన్నారు. మండలంలోని కేతేపల్లిలో ప్రాథమిక సహకార సంఘం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని చెప్పారు. విండో వైస్ చైర్మన్ కుర్వ బాలయ్య, సీఈఓ భాస్కర్‌గౌడ్, విండో డైరెక్టర్లు జైపాల్‌రెడ్డి, ప్రసాద్‌గౌడ్, బాలరాజు, బీరయ్య పాల్గొన్నారు.