
భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
నారాయణపేట: ప్రాజెక్టు కోసం భూములు ఇస్తున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని, న్యాయం చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో మున్సిపల్ పార్క్ వద్ద భూ నిర్వాసితుల దీక్షకు ఆ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా మంత్రి వాకిటి శ్రీహరి స్పందించాలని బహిరంగ మార్కెట్ ధరలకనుగుణంగా న్యాయమైన పరిహారం అందించే విషయంలో సీఎంతో మాట్లాడాలని కోరారు. సీఎం తన సొంత నియోజకవర్గంలో భూనిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించాలన్నారు. రింగ్ రోడ్డుకు, నేషనల్ హైవేలకు ఖమ్మం, భువనగిరి, సంగారెడ్డి జిల్లాలో రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల మేర పరిహారం అందిస్తుంటే సీఎం సొంత నియోజకవర్గంలో కేవలం రూ.14 లక్షలు పరిహారం అని ప్రకటించడం సరికాదన్నారు. రైతు తన ఇష్టంతో భూమిని అమ్ముకోవ డం లేదని ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మాట ప్రకారమే భూమిని కోల్పోతున్నారని, అలాంటి రైతుకు సరైన పరిహారం అందించాలన్నారు. అన్ని విధాలుగా వెనుకబాటు గురైన నారాయణపేట ప్రాంతానికి నీరు అవసరం, ప్రాజెక్టు అవసరం, అదే సందర్భంలో ప్రాజెక్ట్‌కు భూమిని ఇస్తున్న రైతు బాధను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. దీక్షల్లో పేరపళ్ల భూనిర్వాసితులు కూర్చోగా.. నాయకులు నరసింహ, కెంచ నారాయణ మద్దతు తెలిపారు.