
రైతులకు అందుబాటులో ఎరువులు
మాగనూర్: రైతులకు అవసరమైన మేర వరకు ఎరువులను అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని పీఏసీఎస్ కార్యాలయంతో పాటు రైతు ఆగ్రోస్ సేవ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రస్తుత అవసరాలకు మేర రైతులు యూరియా కోనుగోలు చేయాలని అన్నారు. యూరియా దొరకదు అనే తప్పుడు సమాచారాల వల్ల చాలా మంది రైతులు ముందస్తుగానే రెండవ దఫా, మూడవ దఫా ఎరువులు కొని దాచుకుంటున్నారని అన్నారు. అలా కాకుండా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే కొనుగోలు చేయాలని సూచించారు. యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని అన్నారు. ప్రస్తుతం పీఏసీఎస్ నందు 1500 బస్తాలు, ఆగ్రో నందు 500 బస్తాల యూరియా అందుబాటులో ఉందని, ప్రతి రోజు కూడా వస్తూ ఉంటుందని, రైతులు అధైర్య పడవద్దని తెలిపారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి సుదర్శన్‌గౌడ్, చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఆగ్రో మహేష్ పాల్గొన్నారు.