
స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధం
నర్వ: స్థానిక సంస్థల ఎన్నికల ఎప్పుడు వచ్చిన పార్టీ శ్రేణులు సంసిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలన్నారు. ప్రజాసమస్యలపై ఎల్లప్పుడు పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్ పార్టీకి నేటికి ఎలాంటి ప్రజాధారణ తగ్గలేదన్నారు. కార్యకర్తలంతా వెన్నంటి ఉండి గ్రామాగ్రామాన స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండాలను ఎగురవేయాలన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఎలాంటి అధైర్యపడకుండా ఇప్పటి నుండే కష్టపడితే రాబోవు రోజులు మనవేనన్నారు. మక్తల్ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం తప్పదన్నారు. సమావేశంలో పార్టీ నాయకురాలు చిట్టెం సుచరితరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ నర్సింహాగౌడ్, రాజవర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మెన్ లక్ష్మన్న, మాజీ ఎంపీపీ జయరాములుశెట్టి పాల్గొన్నారు.
రెడ్డి కార్పొరేషన్‌ను
ఏర్పాటు చేయాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన విధంగా పేద రెడ్ల అభ్యున్నతి కోసం రెడ్డి కార్పొరేషన్‌కు చట్టబద్ధత కల్పించి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని పాలమూరు రెడ్డి సేవా సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో ఆదివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెడ్డి కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం, రాష్ట్రస్థాయిలో నిర్వహించే అన్ని విద్య, ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు. తమ సంస్థ ద్వారా చదువులో ముందంజలో ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. అలాగే పలు ప్రమాదాల్లో గాయపడిన పేద రెడ్లకు వైద్య సహాయం కోసం ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో రెడ్డి సేవా సమితి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్‌రెడ్డి, కోశాధికారి నర్సింహారెడ్డి, సహధ్యక్షుడు ధనుంజయరెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, ప్రచార కార్యదర్శి సురేందర్‌రెడ్డి, కార్యదర్శి కోటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు/మన్ననూర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపక పోస్టుల భర్తీ నిమిత్తం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్, కెమిస్ట్రీ, జు వాలజీ, డైరీ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్ సబ్జెక్టుల్లో బోధించేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 12గంటలలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నెట్, సెట్, పీహెచ్‌డి అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
● అమ్రాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు–1, కామర్స్–2, ఇంగ్లిష్–1, హిస్టరీ–1, ఎకనామిక్స్–1, పొలిటికల్ సైన్స్–1, జువాలజీ–1, కంప్యూటర్ సైన్స్–1 ఖాళీల భర్తీకి అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గోపాల్ తెలిపారు. ఆయా సబ్జెక్టులకు సంబంధించి పీజీలో 55 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. సెట్, నెట్, స్లేట్, పీహెచ్‌డీ కలిగి ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా కళాశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కోసం 85228 73729, 83319 58940 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధం