
‘పాలమూరు’ కుంభకోణంలో సీఎం పాత్ర
నారాయణపేట రూరల్: కృష్ణా నదిపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పెద్ద కుంభకోణం దాగి ఉందని, అందులో నాడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికి పాత్ర ఉందని బిజెపి రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటివరకు మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ఏ ఒక్క నియోజకవర్గానికి తాగు, సాగునీరు రాలేదని అన్నారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో కుంభకోణం దాగి ఉన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని బయటికి తీయడం లేదని, అందులో రేవంత్ రెడ్డి హస్తం ఉందన్నారు. రెండు రోజుల క్రితం కొల్లాపూర్ సభలో సైతం పాలమూరు ప్రాజెక్టుపై సీఎం మాట్లాడకపోవడం మరింత అనుమానాలకు తావిస్తుందన్నారు. అపెక్స్ కమిటీలో నాటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సంతకం చేసి తెలంగాణకు అన్యాయం చేశారని, బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు సరియైన వాదన వినిపించకపోవడంతో రాష్ట్రానికి నష్టం జరిగిందన్నారు. నీటి వాటా పంపకంలో తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి జలమండలి సమావేశం నిర్వహించి ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించిందన్నారు. అలాగే, జీవో 69 అమలులో భూములు కోల్పోతున్న రైతులకు మరోచోట భూమిని కేటాయించాలని, న్యాయమైన నష్టపరిహారం అందించాలని కోరారు. అంతేగాక, జిల్లా కేంద్ర ప్రజలకు వైద్య సేవలను దూరం చేయడం గర్హనీయమన్నారు. వారంలో ఆసుపత్రి విషయంలో చర్యలు తీసుకోకపోతే మరో ఆందోళన మొదలవుతుందని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు రతంగపండు రెడ్డి, జిల్లా అధ్యక్షులు కొండా సత్తి యాదవ్, మాజీ అధ్యక్షులు పగుడాకుల శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్ పాల్గొన్నారు.