
కోట మైసమ్మ బోనాలు
కోస్గి: పట్టణంలోని మున్నూర్ వీది పాశం గేరిలో ఉన్న కోట మైసమ్మ గ్రామదేవతకు ఆదివారం బోనాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో గ్రామ దేవతలకు బోనాలు నిర్వహించడం అనవాయితీ. ఈ సందర్భంగా కాలనీకి చెందిన మహిళలు, యువతులు ప్రత్యేకంగా వేప కొమ్మలు, పసుపు, కుంకుమలతో అలంకరించిన మట్టి కుండల్లో అమ్మవారికి నైవేద్యం వండి బోనాలతో ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించారు. డప్పుల మోతల మధ్య శివసత్తుల పూనకాలతో నిర్వహించిన బోనాలు ఎంతగానో అలరించాయి. ఇదే క్రమంలో పట్టణంలోని హరిజన్ వాడ మైసమ్మ బోనాల వేడుకను మహిళలు, యువతులు ఘనంగా నిర్వహించారు.