
స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి
మద్దూరు: రైతులకు మద్దతు ధర తదితర ఆంశాలపై స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.రాము డిమాండ్ చేశారు. ఆదివారం మద్దూరులో ఏఐయూకేఎస్ సంఘం డివిజన్ స్థాయి ప్రథమ మహాసభకు హాజరై ప్రసంగించారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇన్నేళ్లు గడుస్తున్నా వాటిని అమలు చేయకపోగా నల్లచట్టాలను అమలు చేస్తోందన్నారు. కార్పొరేట్లకు కొమ్ముకాసే చట్టాలను పార్లమెంట్‌లో ఆమోదం తెలిపిందన్నారు. వీటన్నింటిపై పోరాటం చేయడానికి రైతులను సంఘటితం చేయాలని సూచించారు. ఈ మహాసభలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలకు భూసేకరణ చేస్తున్న నేపథ్యంలో మార్కెట్ ధర రైతులకు చెల్లించాలని, నూతన వ్యవసాయ మార్కెట్ విధానం బిల్లును రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల గ్యారెంటీ చేసి అమలు చేయాలని తీర్మానించారు. అనంతరం ఏఐయూకేఎస్ నారాయణపేట డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చెన్నారెడ్డి, ఉపాధ్యక్షులుగా నారాయణ, ప్రధాన కార్యదర్శిగా కొండ నర్సిములు, సహాయ కార్యదర్శిగా బాలకృష్ణతో పాటు మరో 10 మందిని కార్యవర్గు సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ నెల 25న జిల్లా కేంద్రంలో నిర్వహించే జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీవైఎల్ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ, సంఘం నాయకులు సిద్దు, రాములు, తాయప్ప, నర్సిములు, అంజి, శ్రీహరి, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.