
కార్మికుల భద్రతకు భరోసా
కోస్గి: మున్సిపాలిటీల పరిధిలో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటూ పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జాతీయ యాంత్రీక పారిశుద్ధ్య పర్వావరణ వ్యవస్థ (నమస్తే) అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని కేవలం గ్రేటర్ సిటీలు, నగరపాలికలు, మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని నారాయణపేట, కోస్గి, మక్తల్, మద్దూర్ మున్సిపాలిటీల పరిధిలో అర్హులైన కార్మికులను గుర్తించి యాప్‌లో నమోదు చేస్తున్నారు. మరుగు దొడ్ల వ్యర్థాలు తొలగించే పాకీ పనివారు, సెప్టిక్ ట్యాంకులు, మురుగు కాలువలు, మ్యాన్ హోల్స్ శుభ్రపరిచే కార్మికులు, చెత్త ఏరుకొనే ప్రమాదకరస్థితిని ఎదుర్కొంటున్న కార్మికులకు భద్రత, పునరావాసం కోసం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు.
కార్మికులకు వరం
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమస్తే పథకం కార్మికులకు ఓ వరంగా మారనుంది. పారిశుద్ధ్య కార్మికుల భద్రతతో పాటు గౌరవం, సురక్షితమైన వాతావరణంలో పని చేసుకోవడమే కాకుండా ఈ పథకం కింద గుర్తించిన కార్మికులకు ప్రత్యేక పరికరాలు అందించడం, పునరావాసం కల్పించడం, ఆధునిక, సురక్షిత పద్ధతుల్లో వారికి శిక్షణ ఇవ్వడం, ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ మేరకు గుర్తించిన కార్మికులకు ఆరోగ్య కిట్లు అందించడంతో పాటు సాధ్యమైనంత మేరకు యంత్రాలను వినియోగించేలా చర్యలు చేపడతారు. ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు.
చెత్త సేకరించే వారికి సైతం..
సాధారణంగా పట్టణాల్లో చెత్త సేకరణ ద్వారా ఎన్నో కుటుంబాలు దుర్భర పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. వీరు డంప్ యార్డులు, ఇతర చెత్త నిల్వ ప్రదేశాల్లో చెత్తను సేకరించి అమ్ముకోవడం ద్వారా తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. చెత్త సేకరించే కార్మికులు సైతం తమ వివరాలను అధికారులకు అందించి నమస్తే యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న కార్మికులకు భవష్యత్తులో కేంద్ర ప్రభుత్వం తరుపున ప్రత్యేకంగా పించన్‌తోపాటు ఆర్దిక చేయుతనిచ్చి ఆదుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని నారాయణపేటలో ఐదుగురు, మక్తల్‌లో ఐదుగురు, కోస్గిలో 12 మంది కార్మికులను గుర్తించి నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ఏర్పడిన మద్దూర్ మున్సిపాలిటీలో ఇంకా కార్మికుల గుర్తింపు ప్రక్రియ మొదలు కాలేదు.
పథకం అమలు తీరు ఇలా..
ఆయా వృత్తుల్లో గుర్తించిన కార్మికులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తుంది.
పారిశుద్ధ్య వృత్తికి సంబంధించిన వాహనాల కొనుగోలుకు సబ్సిడీ అందజేస్తారు.
కార్మికుల పిల్లలు చదువుకునేందుకు ఆర్థికసాయం చేస్తారు.
కార్మిక కుటుంబాలకు పునరావాసం కల్పిస్తూ ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తారు.
‘నమస్తే’ పథకానికి కేంద్రం శ్రీకారం
మున్సిపాలిటీల పరిధిలో అమలు
కార్మికుల వివరాలు యాప్‌లో నమోదు
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న ప్రక్రియ

కార్మికుల భద్రతకు భరోసా

కార్మికుల భద్రతకు భరోసా