
బాల్యానికి భరోసా..
నర్వ: బడికి వెళ్లి పాఠాలు వినాల్సిన చిన్నారులు.. తల్లిదండ్రులతో పాటు ఇటుక బట్టీలు.. పొలాలు.. పరిశ్రమల్లో పనిచేసేందుకు లేదా.. గొర్రెలు మేస్తూ కాపరులుగా మారి వివిధ పనుల్లో చేరి బందీ అవుతున్నారు. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో ప్రతి ఏటా జనవరి 1 నుండి 31 వరకు ఆపరేషన్ స్మైల్.. జులై 1 నుండి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్‌లను నిర్వహించి బాల్యానికి భరోసా కల్పించేందుకు ఏడాదిలో రెండు నెలల పాటు ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టి విముక్తికి కృషిచేస్తుంది. జిల్లాలో గత 11 రోజులుగా ఆపరేషన్ ముస్కాన్ ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు దాదాపు 30 మంది బాలకార్మికులను గుర్తించగా వీరిలో 8 మంది బాలికలు, 22 మంది బాలురు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
బాలకార్మికుల విముక్తి కోసం..
బాలకార్మికుల విముక్తి కోసం పోలీస్ శాఖ ప్రతి ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జులైలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాలో ఆపరేషన్ స్మైల్ పూర్తిచేసి జులై 1 నుంచి ముస్కాన్‌ను ప్రారంభించారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ దిశానిర్దేశంతో ఈ నెల 1 నుంచి జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభమైంది. బాలకార్మికులను గుర్తించే పనిలో అధికార బృందాలు నిమగ్నమయ్యాయి. డీఎస్పీ లింగయ్య అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఆపరేషన్ ముస్కాన్‌ను పకడ్భందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది జనవరిలో ఆపరేషన్ స్మైల్‌లో 66 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు. ఇందులో 47 మంది బాలురు, 19 మంది బాలికలను గుర్తించగా అందులో 18 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన బాలకార్మికులు ఉన్నారు. మొత్తం 2 కేసులు నమోదు చేసి 13 మంది బాలలను పనిలో పెట్టుకున్న యజమానులకు రూ.74 వేలు జరిమానా విధించారు. బాలకార్మికులుగా ఉన్న పిల్లలకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. గత ఏడాది కంటే ముస్కాన్ కార్యక్రమంలో ఎక్కువ మంది చిన్నారులకు విముక్తి కలిగేంచేందుకు దాడులను ముమ్మరం చేసేందుకు పోలీస్ అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
ప్రత్యేక బృందాలు..
బాలకార్మికులను గుర్తించి వీరిని విముక్తి కల్పించేందుకు నిర్వహించే దాడుల్లో ఒక్క ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుల్‌లు కలిసి ఒక బృందంగా ఏర్పాటై దాడులు నిర్వహిస్తారు. వీరితో పాటు కార్మికశాఖ, చైల్డ్‌లైన్ 1098, సీ్త్రశిశు సంక్షేమశాఖ, చైల్డెవెల్ఫేర్ కమిటీలు, బాలరక్ష భవన్, సఖీ, చైల్డ్ లైన్, ఐసీడీసీ సీడీపీఓ, ఆధార్ సిబ్బందితో పాటు, అధికారుల సమన్వయంతో బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహిస్తారు. 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల చిన్నారులను వీరు గుర్తించి పనులు చేస్తున్న పని ప్రదేశాలపై దాడులు నిర్వహిస్తున్నారు. అక్కడ పని చేస్తున్న చిన్నారులను చేరదీసి, ఆర్బీసీ సెంటర్‌లు, పాఠశాలల్లో వారు వదిలేసిన తరగతుల్లో చేర్పిస్తున్నారు. పిల్లలను బలవంతంగా పనిచేయించుకుంటున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
పలు శాఖల సమన్వయంతో
కార్మికశాఖ, విద్యాశాఖ, సీ్త్రశిశు సంక్షేమ శాఖ, చైల్డ్‌లైన్, సఖీ, కార్మికశాఖ, బాలరక్షక భవన్, విద్యా శాఖల సమన్వయంతో వ్యవహరించి బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. బాలకార్మిక నిషేధ చట్టం–1986 ప్రకారం ప్రమాదకర పనుల్లో, పరిశ్రమల్లో, 14 ఏళ్ల వయస్సు లోపు బాలబాలికలతో పనిచేయించకూడదు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే యజమానులకు రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పైగా జరిమానాలు విధిస్తారు.
31 వరకు జిల్లాలో ‘ఆపరేషన్ ముస్కాన్’
బాల కార్మికులను వెట్టి నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యం
ప్రత్యేక బృందాలతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు
2019 నుంచి 2025 జనవరి వరకు 964 మంది బాల కార్మికుల గుర్తింపు