
పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యం
నారాయణపేట రూరల్/దామరగిద్ద: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. శుక్రవారం దామరగిద్దలోని ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ఇల్లు లేని పేదలందరికి ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టాలని, విడతల వారీగా డబ్బులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో బాల్‌రెడ్డి, ఎంపీడీఓ సాయిలక్ష్మి, విండో అధ్యక్షుడు ఈదప్ప, శ్రీనివాస్, ఖాజా, అంజప్ప, రఘు. వెంకట్రామరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలలో విధిగా మొక్కలను నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా కేంద్రంలోని సాయి విజయ్ కాలనీ అంతర్గత రహదారుల పక్కన శుక్రవారం మొక్కలు నాటి నీరు పట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాతావరణాన్ని కలుషితం కాకుండా చూసుకోవాలని, అందుకు చెట్లు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆక్సీజన్ కొనాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నారు. యువత, మహిళలు ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి మొక్కల ప్రాముఖ్యతను తెలియచేయాలన్నారు. అంతకుముందు కాలనీ మహిళా బృందం ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మెన్ శివారెడ్డి, మున్సిపల్ కమిషనర్ బోగేశ్వర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ్ బట్టడ్ తదితరులు పాల్గొన్నారు.