
‘అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి’
కోస్గి రూరల్: స్థానిక మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. బుధవారం మున్సిపాలిటీ కార్యాలయంలో ‘కడా’ ప్రత్యేక అధికారితో కలిసి కోస్గి పట్టణ సమగ్ర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా రూ.305 కోట్లు మంజూరు చేశారన్నారు. వాటితో సీసీ రోడ్లు, వీధి దీపాలు, హైమాస్ట్ లైట్లు, జంక్షన్ల నిర్మాణం, పార్కులు, చెరువుల సుందరీకరణ తదితర పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. గూగూల్ మ్యాప్‌తో పట్టణ స్వరూపం, అండర్ డ్రెయినేజీ నిర్మాణాన్ని మూడు విభాగాలుగా విభజించి చేపడుతున్నామన్నారు. భవిష్యత్‌లో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకొని మురుగు నీటి నిల్వ కోసం పట్టణ శివారులో మూడు ఎకరాల స్థలం అవసరమని పబ్లిక్ హెల్త్ ఈఈ విజయభాస్కర్ కలెక్టర్‌ను కోరగా.. ప్రభుత్వ భూమిని చూపించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. రూ. 10.50 కోట్లతో చేపట్టే పట్టణ డంపింగ్ యార్డుకు సీసీ రోడ్ల నిర్మాణ పనులు, జంక్షన్ల పనుల్లో వేగం పెంచాలన్నారు. రూ.37 కోట్లతో చేపట్టే ఆప్రోచ్ రోడ్లు, మేజర్ లింక్ రోడ్లు, సీసీ, డ్రెయినేజీల టెండర్లు పూర్తయిన వాటిని గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
కాంప్లెక్స్ భవన నిర్మాణాల వేగం
రూ. 8.80 కోట్లతో గుండుమాల్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రి పక్కన చేపడుతున్న మండల కాంప్లెక్స్ భవన నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గుండుమాల్ మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న అప్పాయపల్లిలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరీశీలించారు. 129 ఇళ్లు మంజూరు కాగా 40 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైనట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తహసీల్దార్ శ్రీనివాసులు, భాస్కరస్వామి, ఎంపీడీఓ శ్రీధర్, వేణుగోపాల్, పీఆర్‌డీఈ విలోక్, మేనేజర్ అనిల్‌కుమార్, ఏఈ జ్ఞానేశ్వర్ తదితరులు ఉన్నారు.