
‘టీబీ రహిత జిల్లాగా మార్చుదాం’
నారాయణపేట: ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో నారాయణపేటను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. మంగళవారం నారాయణపేట మండలంలోని అప్పక్‌పల్లి వద్ద గల ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ఆడిటోరియంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంపై జిల్లాలోని వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్షయ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి, విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. జిల్లాలో క్షయ నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు.
2030 నాటికి..
2030 నాటికి క్షయ నిర్మూలించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా వైద్య సిబ్బందిని బృందాలుగా విభజించి అనుమానితుల నుంచి తెమడ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాధిగ్రస్తులకు నిక్షయ్ పోషణ యోజన కార్యక్రమం ద్వారా చికిత్సతో పాటు నెలకు రూ.వెయ్యి వారి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారన్నారు. సమావేశంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్‌కిషన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయచంద్రమోహన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెన్సీ డాక్టర్ శ్రీగణ, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకుఅవగాహన కల్పించాలి
మండలంలోని జాజాపూర్‌లో పునాది లెవల్లో ఉన్న ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇంటి త్వరగా పూర్తి చేస్తే డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్‌నాయక్, ఎంపీఓ బాలజీ, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.