
ధాన్యం కొనుగోళ్లలో తప్పిదాలకు తావివ్వొద్దు
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. వడ్ల నాణ్యత, తేమ శాతం తదితర వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి తప్పిదాలు జరిగిన నిర్వహకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మార్కెట్ చైర్మన్ ఆర్. శివారెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి బాలమణి, మార్కెట్ కార్యదర్శి భారతి, సూపర్‌వైజర్ లక్ష్మణ్, నిర్వహకులు ఉన్నారు.
ఉపాధ్యాయులందరూ శిక్షణకు హాజరుకావాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: ఈ నెల 20 నుంచి నిర్వహించనున్న ఇన్ సర్వీస్ శిక్షణ కార్యక్రమానికి ఉపాధ్యాయులందరూ హాజరుకావాలని, ఈమేరకు సంబంధిత ప్రధానాపోధ్యాయులు, ఎంఈఓలు సహకరించాలని డీఈఓ గోవిందరాజులు అన్నారు. సోమవారం జిల్లా రిసోర్స్ పర్సన్‌లతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. జిల్లా స్థాయిలో స్కూల్ అసిస్టెంట్స్ అయిన గణితం, సాంఘిక శాస్త్ర, ఆంగ్లం, ఎస్జీటీ ఉర్దూ మీడియం, స్పెషల్ ఎడ్యుకేషన్, ఎస్జీటీ మండల ఆర్పీలకు ఇన్ సర్వీస్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఈ నెల 13 నుంచి 17 వరకు స్పెల్–1ను, ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు స్పెల్–2 ను నిర్వహించనున్నట్లు వివరించారు. శిక్షణ ఉదయం 9 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు కొనసాగుతందని, శిక్షణ పొందే ఉపాధ్యాయులకు మధ్యాహ్నం భోజన సౌకర్యం ఉంటుందని, టీజీ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా ఆన్‌లైన్ హాజరు నమోదు చేయాలని తెలిపారు. 687 మంది ఉపాధ్యాయులకు, 26 మంది డీఆర్పీల ఆధ్వర్యంలో 5 రోజుల పాటు శిక్షణ కొనసాగనుందని, శిక్షణకు గైర్హాజర్ అయిన వారిపై శాఖపరమైనా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సిరాజుద్దీన్, మహబూబ్‌నగర్ డైట్ లెక్చరర్ పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో తప్పిదాలకు తావివ్వొద్దు