
వసతుల్లేక.. అవస్థలు
కొనుగోలు కేంద్రాల వద్ద ఎండలకు తల్లడిల్లుతున్న రైతులు
మరికల్: ఓ వైపు ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండడం.. మరో వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిలువ నీడ.. తాగేందుకు నీరు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఎండలు, ఉక్కపోతకు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. కేంద్రాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. యాసంగి కోతలు ముమ్మరం కావడంతో భారీగా ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొస్తున్నారు. కనీస వసతులైన నీడ, తాగునీరు, ఇతర వసతులు కల్పన ప్రశ్నార్థకంగా మారింది. చాలా చోట్ల కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించినప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారు. ధాన్యం సేకరణలో ఆలస్యంపై జిల్లాలో పలు చోట్ల రైతులు రోడ్డెక్కుతున్నారు. యాసంగిలో అధిక శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడంతో అధికారులు సైతం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇప్పటి జిల్లా వ్యాప్తంగా కొన్ని మిల్లుల ధాన్యం టార్గెట్ పూర్తి కావడం జరిగింది. కేంద్రాల వద్ద కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలం కావడంతో రైతన్నలు మండుటెండలకు విలవిల్లాడుతున్నారు.
హడలెత్తిస్తున్న ఎండలు..
జిల్లాలో సహకార, గ్రామీణాభివృద్ధి డీసీఎంఎస్, మార్కెటింగ్ శాఖలు ధాన్యాన్ని సేకరిస్తున్నాయి. అయితే, ఎండల తీవ్రతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో నిబంధనల పేరిట కొందరు కొర్రీలు విధిస్తున్నారు. దీంతో రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. రేయింబవళ్లు కల్లాల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. చాలాచోట్ల నామమాత్రంగా తడికెలతో పందిరి ఏర్పాటుచేసినా.. అవి ఏమాత్రం సరిపోవడంలేదు. విధిలేక చెట్ల నీడలో తల దాచుకుంటున్నారు. అటు తాగేందుకు నీటి సౌకర్యం కూడా కల్పించలేదు. జిల్లా వైద్యాధికారి సమన్వయంతో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను కేంద్రాల్లో నిల్వ చేయాలనే ఆదేశాలిచ్చినా.. పాటించడం లేదు. ఇదిలాఉండగా, వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదనే పలువురు అధికారులు పేర్కొంటున్నారని సమాచారం. మరోపక్క సమయానికి లారీలు కూడా రాకపోవడంతో ధాన్యం ఆరబెట్టిన రైతులకు అకాల వర్షాల భయం పట్టుకుంది.
‘ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా, అకాల వర్షాలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి..’ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే ముందు వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలు ఇవి. కానీ జిల్లాలో
ఇవి ఎక్కడ అమలు కావడం లేదు.
టెంట్లు లేవు..
తీలేర్ కొనుగోలు కేంద్రం దగర టెంటు వేసిన మూడు రోజులకే ఈదురు గాలులకు కూలిపోయింది. తిరిగి దాని మళ్లీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఎండలకు తాళలేక చెట్ల నీడ కింద సేద తీర్చుకుంటున్నాం. అలాగే తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో లేవు. వడదెబ్బ తగిలితే ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాం.
– కృష్ణారెడ్డి, రైతు, పెద్దచింతకుంట
నీళ్ల బాటిళ్లు కొనుగోలు చేస్తున్నాం
అధికారులు కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీటి వసతి కల్పించకపోవడంతో నీళ్ల బాటిళ్లను కొనుగోలు చేసి తాగుతున్నాం. కనీస వసతులు కల్పించాలని అధికారులను అడిగితే.. నిధులు మంజూరు కాలేదు, తాము ఏం చేయాలేమని చేతులు ఎత్తేస్తున్నారు. కేంద్రాల దగర వసతులు కల్పించేందుకు అధికారులు చొరవ చూపాలి.
– వెంకటయ్య, రైతు, రాకొండ
చర్యలు చేపడతాం
జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల దగర నిబంధనాల ప్రకారం కనీస వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. కానీ అక్కడక్కడ టెంట్లు గాలివానలకు కూలిపోయాయి. ఎండల ప్రభావం పెరుగుతుండటంతో తాగునీటి వసతి కల్పిస్తాం.
– సైదులు, సివిల్ సప్లయ్ జిల్లా అధికారి
కానరాని టెంట్లు.. తాగునీరు
వెంటాడుతున్న అకాల వర్షాలు..
జిల్లాలోని 102 కేంద్రాల వద్ద ఇదే పరిస్థితి

వసతుల్లేక.. అవస్థలు

వసతుల్లేక.. అవస్థలు