
జమిలి ఎన్నికలతో తగ్గనున్న ఆర్థికభారం
కోస్గి రూరల్: భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలో భాగంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకేఎన్నిక అంశంపై ప్రజల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో చేపట్టిందని వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాష్ట్ర స్టిరింగ్ కమిటి సభ్యులు కొల్లి మాధవి, ఆధ్యాత్మికవేత్త భాస్కరయోగి అన్నారు. శనివారం పట్టణంలో నిర్వహించిన మేధావుల సదస్సుకు హాజరై మాట్లాడారు. దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు ఇప్పటివి కావని దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పలు సార్లు ఒకే సారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయన్నారు. ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఆర్థికభారం తగ్గుతుందని, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు వేగంగా పూర్తి అవుతాయన్నారు. 29 రాష్ట్రాలలో పలు మార్లు ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధికి ఆటంకటం కలుగుతుందన్నారు. అధికారుల సమయం వృథా అవుతుందని, ఎన్నికల ఖర్చులు భారీగా పెరుగుతాయని గుర్తు చేశారు. మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్ ఆధ్వర్యంలో ఒకే దేశం ఒకేఎన్నికపై కమిటి వేశారని అన్నారు. నీతి అయోగ్ కూడా జమిలి ఎన్నికలకు పలు సూచనలు చేసిందన్నారు. కార్యక్రమంలోజిల్లా స్టిరింగ్ కమిటి బస్వరాజ్ ,మండల కన్వినర్ సుదర్శన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.