అన్నీ.. అవరోధాలే
ఆర్‌ఓబీ నిర్మాణంతో రెండుగా చీలిన దేవరకద్ర పట్టణం
దేవరకద్ర: రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది దేవరకద్ర పట్టణ పరిస్థితి.. ఒకప్పుడు రైలు గేటు పడటంతో ట్రాఫిక్ స్తంభించి ఇక్కట్లు పడాల్సి వస్తుందని ఆర్‌ఓబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) నిర్మిస్తే.. ఇప్పుడు ఏకంగా మొత్తం దేవరకద్ర పట్టణమే రెండుగా చీలిపోయిన దుస్థితి దాపురించింది. ఆర్వోబీ ప్రారంభమై ట్రాఫిక్ సమస్య తీరిందనే సంతోషం ఒక్క రోజు కూడా దక్కలేదు. అధికారులు గేటును పూర్తిగా మూసి వేసి ఇనుప స్తంభాలను అడ్డంగా బిగించారు. దీంతో దేవరకద్ర ప్రజల కష్టాలు అప్పటి నుంచి మొదలై ఇప్పటికీ తీరని సమస్యగా మారింది. ఇటు పాత బస్టాండ్, అటు కొత్త బస్టాండ్‌కు మధ్యలో మూసిన గేటు ఉండడంతో పట్టణం రెండుగా చీలిపోయింది. గేటు మూసేయడం వల్ల వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోగా.. రోడ్డుకు రెండువైపులా ఉన్న వ్యాపార కేంద్రాలన్నీ దాదాపుగా మూతబడటంతో కొందరు వ్యాపారులు ప్రత్యామ్నాయంగా రాయిచూర్ రోడ్డుకు షాపులను తరలించారు.
కార్యాలయాలు ఒకవైపు..
దేవరకద్రలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ పాత పట్టణంలోనే ఉన్నాయి. ఆయా కార్యాలయాలకు వచ్చే ప్రజలు నిత్యం గేటును దాటుకుని రావాల్సి వస్తుంది. ద్విచక్ర వాహనదారులు మూసిన గేటు వద్దనే వాహనాలు నిలిపి నడిచి వెళ్లి పనులు చేసుకుంటున్నారు. పాత పట్టణంలో తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలు, ప్రభుత్వ దవాఖానా, పోలీస్‌స్టేషన్, పశువైద్యశాల, ఎస్‌టీఓ, పీఆర్, మిషన్ భగీరథ తదితర కార్యాలయాలతోపాటు పశువుల సంత, కూరగాయల సంత పాత బస్టాండ్ వైపే ఉన్నాయి. మార్కెట్ కార్యాలయం, హోల్‌సేల్ వ్యాపారాలు, విద్యుత్ కార్యాలయం, బ్యాంకులు అన్ని కొత్త బస్టాండ్ వైపు ఉన్నాయి. దేవరకద్ర పట్టణం ఇలా రెండుగా చీలిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆర్‌యూబీ పూర్తయితేనే..
దేవరకద్రకు కొత్తగా ఆర్‌యూబీ మంజూరైనట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. గత వారం ఎంపీ డీకే అరుణ జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దేవరకద్రతోపాటు కౌకుంట్లకు ఆర్‌యూబీలు మంజూరయ్యాయని చెప్పారు. అయితే పనులు వెంటనే ప్రారంభించి కనీసం బస్సుల రాకపోకలు సాగించే విధంగా ఆర్‌యూబీ నిర్మిస్తే కొంత వరకై నా పట్టణం ఒక్కటిగా కలిసిపోయే అవకాశం ఉంటుంది. అలాగే బస్టాండ్‌లోకి బస్సులు వస్తే ప్రయాణికుల ఇబ్బందులు తొలగడంతోపాటు వ్యాపారాలు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది.
బస్సులు రాకపోవడంతో..
దేవరకద్ర మీదుగా నిత్యం దాదాపు 400 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. రాయిచూర్, నారాయణపేట, మక్తల్, ఆత్మకూర్ వంటి పట్టణాలతోపాటు కర్ణాటకలోని పలు ప్రాంతాలకు ఈ మార్గంలోనే బస్సులు తిరుగుతాయి. ఆయా బస్సుల రాకపోకలతో నిత్యం కళకళలాడే బస్టాండ్ ఇప్పుడు అటు వైపు రాకపోవడంతో వెలవెలబోతోంది. దీంతో ప్రయాణికులంతా ఆర్‌ఓబీకి రెండు వైపులా చివరలో రోడ్డు పక్కన నిలబడి బస్సులు ఎక్కాల్సి వస్తుంది. చిన్నపిల్లలు, బ్యాగులతో మహిళలు, వృద్ధులు ఇబ్బందుల పాలవుతున్నారు. అధికారులు ఈ విషయంలో స్పందించి ఆర్‌ఓబీకి రెండువైపులా తాత్కాలికంగా నిలబడటానికి బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
పదుల సంఖ్యలో మూతబడిన వ్యాపార కేంద్రాలు
రోడ్డుపైనే ఆగుతున్న బస్సులు
రాకపోకలు లేక వెలవెలబోతున్న బస్టాండ్
ఎండ, వానలకు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
అన్నీ.. అవరోధాలే


