వసంతోత్సవాలకు అంకురార్పణ | - | Sakshi
Sakshi News home page

వసంతోత్సవాలకు అంకురార్పణ

Apr 13 2026 7:50 AM | Updated on Apr 13 2026 7:50 AM

సంగమేశ్వరంలో ప్రత్యేక పూజలు

ఆళ్లగడ్డ: లోక కల్యాణార్థం విశ్వశాంతిని కోరుతూ శ్రీ అహోబిలేశుడి వార్షిక వసంతోత్సవాలకు నాంది పలుకుతూ దిగువ అహోబిలంలో ఆదివారం రాత్రి అంకురార్పణ పూజలు చేపట్టారు. సోమవారం నుంచి వైభవంగా సాగే కృతువుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని శాస్త్రోక్తంగా విశ్వక్సేనుడి ఆరాధన నిర్వహించారు. అనంతరం తిరుమంజనం, స్వస్తివచనంతో పాటు మృత్సంగహణం, రక్షాబంధనంతో ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేశారు. వైష్ణవ ఆచారంగా రాత్రివేళ వేదమంత్ర పఠనాలతో మత్స్యంగ్రహణం పర్వాన్ని చేపట్టారు. అనంతరం ఈశాన్యంలోని పుట్టమన్ను తెచ్చి నవధాన్యాలను నాటి ఉత్సవాలకు నాంది పలికారు. అంతకు ముందు ఉత్సవ మూర్తులైన శ్రీ ప్రహ్లాదవరదస్వామిని ఉభయ దేవురులతో యాగశాలలో కొలువుంచి తిరుమంజనం చేపట్టారు.

కొత్తపల్లి: మండలంలోని నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న సప్తనది సంగమ ప్రాంతంలో వెలసిన ప్రాచీన సంగమేశ్వరాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. కృష్ణాజలాల నుంచి ఆలయం బయటపడడంతో భక్తులు ప్రాచీన సంగమేశ్వరాలయాన్ని సందర్శించేందుకు వస్తున్నారు. దీంతోపాటు ప్రాచీన గర్భాలయంలోని వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజలు చేసుకుంటున్నారు. ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ వేపదారు శివలింగాన్ని పూలమాలలతో అలంకరించారు. అనంతరం కుంకుమార్చన, పుష్పార్చన, బిల్వార్చన, మహా మంగళహారతి వంటి విశేష పూజలు చేశారు.

శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా క్యూకంపార్ట్‌మెంట్లలో తాగునీరు, అల్పాహారం, ప్రసాదం పంపిణీ చేశారు.

ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌నకు ఎంపిక

వెలుగోడు: పట్టణానికి చెందిన బండి స్వాతి అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక అవసరాలు ఉన్న మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌ సాహసయాత్రకు ఎంపికై ంది. ఈనెల 14 నుంచి 30 వరకు రాష్ట్ర సర్వ శిక్ష అభియాన్‌ అధికారుల పర్యవేక్షణలో ఈ సాహస యాత్ర జరగనుంది. ఈ యాత్రలో మొత్తం 20 మంది విద్యార్థులు పాల్గొననుండగా, అందులో తమ కళాశాల విద్యార్థిని ఎంపిక కావడం గర్వకారణమని ప్రిన్సిపాల్‌ ఎం.నళిని తెలిపారు. ఈ సందర్భంలో కళాశాల అధ్యాపక బృందం బండి స్వాతికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement