● రెండు నెలలుగా వేతనాలు
అందక అవస్థలు
● శ్రీశైల దేవస్థాన పరిపాలన భవనం
వద్ద కార్మికుల నిరసన
శ్రీశైలంటెంపుల్: రెండు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ద్య, హౌస్‌కీపింగ్‌కార్మికులు ఆదివారం ఉదయం దేవస్థాన పరిపాలన భవనం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్మికులపై పద్మావతి ఏజెన్సీ చిన్నచూపు చూస్తోంది. రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. దీంతో వేతనాల కోసం ఆందోళన బాట పట్టారు. కిరాణ కొట్టులో కూడా నిత్యావసర సరుకులు అప్పు ఇవ్వడం లేదని కార్మికులు వాపోతున్నారు. రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే మా జీవనం ఎలా గడుస్తుందని కార్మికులు గగ్గోలు పెట్టారు. వేతనాల గురించి పద్మావతి ఏజెన్సీ ప్రతినిధులను అడిగితే దేవస్థాన ఈఓ బిల్లులు చేయడం లేదని సమాధానం చెబుతున్నట్లు కార్మికులు తెలిపారు. అంతేకాకుండా ‘మీకు ఇష్టం వచ్చిన వాళ్ల దగ్గరికి వెళ్లి చెప్పుకోండి ఏమి చేయలేరు.. మీరు ఫిర్యాదు చేసే నేను మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తాం’ అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నట్లు కార్మికులు వాపోతున్నారు. 10 మంది చేసే పని దగ్గర నలుగురితో చేయిస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. అంతేకాకుండా కార్మికుల ఖాతాలో వేతనాలు ఎక్కువ వేసి తిరిగి పద్మావతి ఏజెన్సీ ప్రతినిధులు వెనక్కి ఇప్పించుకుంటున్నారని కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికై న శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి స్పందించి కార్మికులకు ప్రతి నెల వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు పేర్కొన్నారు.


