నంద్యాల: విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధతతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఏర్పడే కరువు పరిస్థితులు కూడా విపత్తులలో భాగమేనన్నారు. విపత్తు సంభవించిన తర్వా త చర్యలు తీసుకోవడం కంటే, ముందస్తు ప్రణాళిక, సన్నద్ధత అత్యంత కీలకమన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో పంటలను ఎలా రక్షించుకోవాలో రైతులకు తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని, భూగర్భ జలాల లభ్యత తగ్గే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని హార్టికల్చర్ మల్చింగ్ వంటి పద్ధతులను ప్రోత్సహించాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పశువుల నీటి తొట్టెల వద్ద ఎలాంటి లీకేజీలు లేకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. వేసవికాలంలో అగ్నిప్రమాదాలు అధికమయ్యే అవకాశం ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తోగట ప్రియాంకతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


