అమరావతి పేరిట హైడ్రామా | - | Sakshi
Sakshi News home page

అమరావతి పేరిట హైడ్రామా

Mar 30 2026 7:24 AM | Updated on Mar 30 2026 7:24 AM

ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి

మంత్రాలయం రూరల్‌: అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. రాంపురం గ్రామంలో ఆదివారం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక అమరావతి రాజధాని పేరుతో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఆ ప్రాంతంలో అభివృద్ధే కనిపించడం లేదని, అవినీతి జరుగుతుందని ప్రశ్నిస్తే బురదజల్లడం చంద్రబాబు అలవాటైపోయిందన్నారు. అమరావతి రాజధానికి ఎవరు అడ్డు పడుతున్నారో, ఎవరు వ్యతిరేకిస్తున్నారో, ఎందుకు తీర్మానం చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. రైతు సమస్యలను పక్కదారి పట్టించే కుట్రలో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం పేరిట డ్రామా చేశారని విమర్శించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లు చెరువులో ఉన్నాయన్నాయన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఘోరంగా విఫలమవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. అమరావతిని టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. 2028లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూ డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాజధానిలో మూడు పంటలు పండే లక్షల ఎకరాలను రైతుల నుంచి సేకరించి కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాలన వైఫల్యాలను నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మభ్యపెడడుతున్నారన్నారు.

అదుపు తప్పిన కారు

నంద్యాల(అర్బన్‌): అబాండం తండా గ్రామ సమీపంలో కారు అదుపు తప్పి కాల్వలో పడింది. హైవే పనుల్లో భాగంగా అబాండం తాండ దాటిన తర్వాత మహానంది రస్తాలో నూతన వంతెన పనులు జరుగుతున్నాయి. పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి పనుల నిమిత్తం మహానందికి బయల్దేరగా వంతెన వద్ద ఎలాంటి ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడంతో కారు కాల్వలో పడింది. ప్రమాదంలో ప్రభాకర్‌రెడ్డి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరొకరిపై జిల్లా బహిష్కరణ వేటు

కర్నూలు: శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్న మరొకరిపై జిల్లా బహిష్కరణ వేటు పడింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బుధవారపేటలో నివాసముంటున్న పొలిశెట్టి అశోక్‌ను ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ప్రతిపాదన మేరకు జిల్లా బహిష్కరణ చేస్తూ కలెక్టర్‌ సిరి ఉత్తర్వులిచ్చారు. పొలిశెట్టి అశోక్‌పై మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్‌ ఉంది. పలు క్రిమినల్‌ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. గతంలో తీవ్రమైన నేరాలకు, ముఖ్యంగా హత్యలకు సంబంధించిన కేసుల్లో పాల్గొని పోలీసుల రికార్డులకెక్కాడు. రాబోవు కాలంలో ప్రజల్లో భయాందోళన సృష్టించే అవకాశమున్న నేపథ్యంలో చట్టపరమైన నిబంధనల ప్రకారం జిల్లా బహిష్కరణకు పోలీసు అధికారులు ఉత్తర్వులిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు చెడు నడత కలిగిన తొమ్మిది మందిపై జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement