నంద్యాల: జల్సాలకు అలవాటు పడి జిల్లాలో చోరీల కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను నంద్యాల పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సునీల్ షెరాన్ ఆధ్వర్యంలో అరెస్ట్ చూపించారు. ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ షెరాన్‌మాట్లాడుతూ.. బెంగళూరుకు చెందిన సోహెల్ ఖాన్ నంద్యాల జిల్లాలో ఆత్మకూరు, నంద్యాల పోలీసు స్టేషన్ల పరిధిలో పలు చోరీలు చేశారు. చోరీలకు పాల్పడుతూ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న సోహెల్‌ఖాన్‌ను ఆదివారం వెలుగోడు ఎస్సార్బీసీ కేసీ కెనాల్ కోట్ల కింద ఉండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇతని వద్ద నుంచి ఆత్మకూరు స్టేషన్ల పరిధిలో చోరీకి పాల్పడిన 40 తులాల బంగారు, నంద్యాల పోలీసు స్టేషన్ల పరిధిలో చోరీ చేసిన రెండు తులాల బంగారు ఆభరణాలను సీజ్ చేశామన్నారు. చోరీలకు పాల్పడిన సొమ్ము ను వెలుగోడు దగ్గర ఉన్న ఎస్సార్బీసీ కెనాల్ దగ్గర దాచి పెట్టేవాడన్నారు. ఇతని గతంలో కుప్పం, పెనుగొండ, కర్ణాటక రాష్ట్రాల్లో పలు కేసులు నమోదు అయ్యాయన్నారు. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో గాలించి అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో దొంగను అరెస్ట్ చేసిన సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.
● 42 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం


