కర్నూలు(సెంట్రల్): ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలను ఆదేశించారు. ఆమె మంగళవారం కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదామును రాజకీయ పార్టీల సమక్షంలో పరిశీలించి పటిష్ట భద్రతకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అంతకముందు ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియపై ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. ఆదోని, పాణ్యం, కర్నూలు నియోజకవర్గాల్లో ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని, వేగవంతం చేయాలని ఆదేశించారు. సంబంధిత నియోజక వర్గాల తహసీల్దార్లు బీఎల్‌ఓలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని పురోగతి తీసుకురావాలన్నారు. ఆలూరు, కోడుమూరులో ఓటర్ల పురోగతి బాగుందన్నారు. అదేవిధంగా క్లెయిమ్స్, డెమోగ్రాఫిక్ కరెక్షన్‌కు సంబంధించిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్‌కుమార్, ఆదోని ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ అజయ్‌కుమార్ పాల్గొన్నారు.


