● ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6 అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానం పెరిగే అవకాశం ● ఒక్కో అసెంబ్లీలో 1.60లక్షల ఓటర్లు ఉండేలా విభజన ● పునర్విభజనలో మహిళలకు 33 శాతం సీట్లు ● ఎస్సీ, ఎస్టీలకు కూడా పెరగనున్న సీట్లు
ఎమ్మెల్యే, ఎంపీలు కావాలని ఆశపడుతున్న రాజకీయ ఆశావహులకు శుభవార్త. దేశంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల పునర్విభజన ప్రక్రియకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈమేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుల నేతృత్వంలో సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల పునర్విభజనకు వీలుగా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ (పునర్విభజన) చట్టాల బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. – సాక్షి ప్రతినిధి కర్నూలు
సాక్షి ప్రతినిధి కర్నూలు: దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై 2026 వరకూ నిషేధం ఉంది. అయితే ఏపీ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణ బిల్లు–2014లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేకంగా పార్లమెంట్ వెసులుబాటు కల్పించింది. కొత్తగా రాష్ట్రాలు ఏర్పా టు అవుతున్నాయి కాబట్టి నియోజకవర్గాల పునర్విభజనపై ఆ రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయని బిల్లులో పేర్కొన్నారు. అయితే అనివార్య కారణాలతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై ముందడుగు వేయలేకపోయాయి. ఈ క్రమంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా నిషేధం పూర్తవడం, కేంద్ర హోంశాఖ దీనిపై నిర్ణయం తీసుకోవడంతో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడం, ఆపై పునర్విభజనపై కమిషన్ ఏర్పాటు చేయడమే తరువాయి. 2029 సార్వత్రిక ఎన్నికలు కొత్తగా పెరిగే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలతోనే జరగనున్నాయి.
ఉమ్మడి కర్నూలులో పెరగనున్న 6 అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానం
ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పార్లమెంట్ పరిధిలో 2 అసెంబ్లీల చొప్పున ఉమ్మడి జిల్లాలో 4 అసెంబ్లీలు కొత్తగా ఏర్పాటవుతాయని అంతా భావించారు. అయితే 50 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలో 88 అసెంబ్లీలు పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్లమెంట్‌కు 3 చొప్పున మొత్తం 6 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ఈ లెక్కన 20 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ చట్టంతో ప్రస్తుతం ఉన్న 2 ఎస్సీ స్థానాలు 3కు పెరిగే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్‌తో మొత్తం నియోజకవర్గాల్లో 33 శాతం మహిళలకు రిజర్వ్ కానున్నాయి. 20 స్థానాల్లో దాదాపు 7 స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. 2027 మార్చికి జనాభా లెక్కల ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో కొత్త జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరగనుంది. 1.60లక్షల ఓట్లతో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు కానుంది.
1 లేదా 2 ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం
పార్లమెంట్ స్థానాల సంఖ్య 25 నుంచి 38కి పెరిగే అవకాశం ఉంది. దీంతో ఒక స్థానం కచ్చితంగా పెరుగుతుంది. అయితే రాష్ట్రంలోని పెద్ద జిల్లాలో కర్నూలు ఒకటి. ఆ మేరకు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక ఎంపీ స్థానం చొప్పున రెండు జిల్లాల్లో పెరగనున్నాయి. అలాగే రెండు జిల్లాల్లో కలిపి మరో ఎంపీ స్థానం కూడా పెరిగే అవకాశం ఉంది. ఆదోని కేంద్రంగా పార్లమెంట్ స్థానం ఏర్పాటయ్యే అవకాశం ఉండొచ్చు.


