శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండి పోయాయి. క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు దేవస్థాన అధికారులు పంపిణీ చేశారు. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి.


