పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
గోస్పాడు: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు. జిల్లా స్థాయి అధికారులతో సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. పోలియో వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించాలని, అందుకు అన్ని లైన్ డిపార్టుమెంట్లు సమన్వయంతో పని చేయాలన్నారు. 5 సంవత్సరాల్లోపు పిల్లలు 2,38,404 మంది ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా 1,318 బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 5,272 మంది సిబ్బంది 21వ తేదీ ఆదివారం బూత్ స్థాయిలో పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ఈనెల 22, 23 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుదర్శన్‌బాబు మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, సంత మార్కెట్ల వద్ద బూత్‌లు ఏర్పాటు చేసి పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ లలిత, ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు ప్రసన్నలక్ష్మి, శ్రీజ, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
కేసీకి పెరిగిన నీటి విడుదల
జూపాడుబంగ్లా: కర్నూలు కడప (కేసీ) కాల్వకు సాగునీటి విడుదలను అధికారులు పెంచారు. సుంకేసుల డ్యాం నుంచి 2,500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు ఏఈ శ్రీనివాసనాయక్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సుంకేసుల డ్యాం నుంచి 2 వేల క్యూసెక్కుల నుంచి 2500 క్యూసెక్కులకు పెంచామన్నారు. అందులో రైతుల వినియోగ అనంతరం లాకిన్స్‌లాకు 2,117 క్యూసెక్కులు చేరుతున్నట్లు తెలిపారు. అందులో నిప్పులవాగుకు 1,702 క్యూసెక్కులు, తూడిచెర్ల సబ్‌చానల్ కాల్వకు 360 క్యూసెక్కులు, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు 55 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ శ్రీనివాసనాయక్ తెలిపారు.


