రీ ఓపెన్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదికలో రీ ఓపెన్ అయిన 592 దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే ప్రతి అర్జీ ప్రజల నమ్మకానికి నిదర్శనమని, వాటిని అత్యంత ప్రాధాన్యంతో, నాణ్యతతో, నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడం అధికారులు బాధ్యతగా భావించాలన్నారు. పెండింగ్ అర్జీల ఆడిట్‌ను నిరంతర ప్రక్రియగా తీసుకోవాలన్నారు. ప్రతి దరఖాస్తు ప్రగతి దశను అధికారులు స్వయంగా పర్యవేక్షించి ఆలస్యానికి తావు లేకుండా చూడాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో 292 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి వినతులు సమర్పించారని, ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


