బాత్‌రూమ్ నిర్మించ లేదని..
● పుట్టింటికెళ్లిన భార్య
● మనస్తాపంతో భర్త ఆత్మహత్య
కొత్తపల్లి: బాత్‌రూమ్ సమ స్య ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఎదురుపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసు కుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామాని కి చెందిన శివశంకర్ (35), అతని సోదరుడు పక్కపక్కన నివాసముంటున్నారు. రెండిళ్లకు కలసి ఒకే బాత్ రూమ్ ఉంది. కొన్నాళ్ల పాటు సర్దుకుంటూ వచ్చిన శివశంకర్ భార్య శశికళ ఇటీవల వేరుగా బాత్‌రూమ్ నిర్మించాలని కోరింది. 10 రోజుల క్రితం ఈ విషయంలో దంపతులు ఘర్షణ పడ్డారు. బాత్‌రూమ్ నిర్మించేంత వరకు ఇంట్లో ఉండనంటూ శశికళ జూపాడుబంగ్లాలోని పుట్టినింటికి వెళ్లిపోయింది. అయితే భర్త శివశంకర్ ఎంత బతిమలాడినా తిరిగిరాలేదు. దీంతో మనస్తాపం చెందిన శివశంకర్ శనివారం రాత్రి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడి తల్లి తేనె భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఎం.రవీంద్రబాబు సోమవారం వెల్లడించారు.
చాగలమర్రి: విద్య, వైద్యంతో పాటు ఆధ్యాత్మికత పెంపునకు ఎస్పీజీ మిషనరీ కృషి చేస్తోందని నంద్యాల అధ్యక్ష కాండపు బిషప్ ప్రసన్నరావు అన్నారు. సోమవారం ఎంతో చరిత్ర కలిగిన ముతాల్యపాడులోని ఎస్‌పీజీ పరిశుద్ధ జన్మోత్సవ 133వ ప్రతిష్ట వార్షికోత్సవం కార్యక్రమం జరిగింది. అతిథిగా హాజరైన నంద్యాల బిషప్ ప్రసన్నరావు, ఆయన సతీమణి నంద్యాల డయాసిసి ఉమెన్ ఫెలోషిప్ అధ్యక్షురాలు బ్యాలా సంతోష్‌కు డీనరీ చైర్మన్ రెవ. చంద్రశేఖర్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని భక్తులకు ఏసుక్రీస్తు సందేశం అందించారు. కార్యక్రమంలో నంద్యాల డయాసిస్ సెక్రటరీ రెవ. నందం ఐజాక్, ట్రెజరర్ రెవ. బండి శామ్యుల్, ఎస్‌ఈజీ ప్రతాప్, ఆళ్లగడ్డ డీనరీ చైర్మన్ ఐజాక్ ప్రసన్నరావు, చర్చి సంఘం పెద్దలు పాల్గొన్నారు.
కొలిమిగుండ్ల: నాపరాళ్ల రవాణకు రాయల్టీ వసూలు చేసే బాధ్యత ప్రవేట్ సంస్థకు అప్పగించడంతో అడుగడుగునా ప్రైవేట్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం కొలిమిగుండ్లలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదురుగా చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. బెలుం సమీపంలోని నాపరాతి గనుల నుంచి ట్రాక్టర్ లోడ్ చేసుకొని వెళుతున్న సమయంలో సిబ్బంది ఆపినా నిలపక పోవడంతో బైక్‌లో వచ్చి ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. రాయల్టీ చెల్లించి రవాణ చేయాలని యజమానికి సూచించారు. కొలిమిగుండ్ల, ఇటిక్యాల, కనకాద్రిపల్లె, రాఘవరాజుపల్లె గ్రామాల్లో వందకు పైగానే పాలీష్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కొలిమిగుండ్లలో చెక్‌పోస్టు ఏర్పాటు చేయకముందు బెలుం, బెలుం శింగవరం గ్రామాల్లోని నాపరాతి గనుల నుంచి రవాణ చేసే ట్రాక్టర్లు రాయల్టీలు లేకుండా పోతుండేవి. గమనించిన ప్రైవేట్ సంస్థ ఇక్కడ చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. దీంతో యజమానులు తప్పక రాయల్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క వాహనం కూడ రాయల్టీ లేకుండా వెళ్లేందుకు లేకుండా పలు చోట్ల చెక్‌పోస్టులు పెట్టారు. బెలుం–బెలుం శింగవరం మధ్యలో, కొలిమిగుండ్లలోని జమ్మలమడుగు క్రాస్ రోడ్డు, బందార్లపల్లె క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేయగా తాజాగా కొలిమిగుండ్ల విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఏర్పాటు చేసి 24 గంటల పాటు సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు.ప్రైవేట్ సంస్థ నెలకు రూ.14.5 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి రావడంతో పక్బడందీగా వసూలు చేస్తున్నారు.
ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు
రూ.4.91 లక్షల జరిమానా
డోన్ టౌన్: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు డోన్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతికుమార్ రూ.4.91 లక్షల జరిమానా విధించారు. సోమవారం డోన్ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా అనంతపురం వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న బిహార్ రాష్ట్రానికి చెందిన ట్రావెల్ పాయింట్ బస్సు నిలిపారు. అయితే డ్రైవరు బస్సు ఆపకుండా వెళ్లడంతో అధికారిలో కారుతో వెంబడించి జగదుర్తి సమీపంలో అడ్డుకున్నారు. పర్మిట్‌లు చూపించమని డ్రైవర్‌ను అడుగగా అధికారిపై దురుసుగా వ్యవహరిస్తూ ఎలాంటి పత్రాలు చూపలేదు. వెంటనే ఆన్‌లైన్‌లో పరిశీలించగా ఎలాంటి రోడ్డు టాక్స్‌లు చెల్లించడం లేదని గుర్తించి బస్సును సీజ్ చేశారు. జరిమానా కింద రూ. 4.91 లక్షలు విధించినట్లు ఎంవీఐ తెలిపారు.
బాత్‌రూమ్ నిర్మించ లేదని..
బాత్‌రూమ్ నిర్మించ లేదని..


