మద్యం తాగొద్దన్నందుకు...
పాములపాడు: మద్యం తాగవద్దు అని వా రించినందుకు ఓ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని మద్దూరు గ్రామ పంచాయతీ మజరా క్రిష్ణానగర్ గ్రామంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగించే బాలయ్య (60) మద్యానికి బానిసయ్యాడు. భార్య లక్ష్మీదేవి, కుమారుడు అరుణ్ ఆరోగ్యం దెబ్బతింటుంది మద్యం అలవాటు మానేయాలని వారించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆత్మకూరు వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
బనగానపల్లె రూరల్: మండలంలోని పలుకూరు గ్రామానికి చెందిన సురేంద్ర (44)అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గంగన్న కుమారుడు సురేంద్ర తన ఇంటిలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో విద్యుత్ మీటర్ వద్దకు వెళ్లీ ఫ్యూజ్ బిగిస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం గ్రామంలోని ఓ ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే సురేంద్ర మృతి చెందినట్లు అతను తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మృతుడి భార్య సంధ్యా సుధా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐతెలిపారు.మృతుడికి ఒక కూతురు ఉంది.
విజిలెన్స్ అధికారుల దాడులు
ఆత్మకూరు: పట్టణంలోని పలు దుకాణాలపై సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అతిథి హోటల్‌లో చికెన్‌ను పరిశీలించి సరిగ్గా లేకపోవడంతో రూ.10 వేలు జరిమానా విధించారు. అలాగే కప్పలకుంట్లలోని అనన్ బేకరీలో అటుకులు పరిశీలించి నాణ్యతగా లేవని రూ.8 వేలు జరిమానా విధించారు. బ్రదర్ బేకరీలో కూల్ కేకులను టెస్టింగ్‌కు పంపించారు. అధికారుల దాడుల నేపథ్యంలో పలువురు వ్యాపారులు దుకాణాలు మూసేశారు. విజిలెన్స్ అధికారులు వెంకటరమణ, విశ్వనాథం, ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ షేక్షావలి, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు.
నిందితుడికి జైలు శిక్ష
కర్నూలు: కాంట్రాక్టు బిల్లులు చెల్లించే విషయంలో లంచం తీసుకున్న కేసులో నిందితుడు దక్షిణ మధ్య రైల్వే డివిజినల్ ఫైనాన్స్ సీనియర్ అకౌంటెంట్ చల్లా శ్రీనివాసులు (ప్రస్తుతం రిటైర్డ్)కు రెండేళ్లు జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎం.శోభారాణి సోమవారం తీర్పు ఇచ్చారు. 2017 నవంబర్ 20న ఫిర్యాది కాంట్రాక్టర్ అయిన సీహెచ్‌డీ రాజుల నాయుడు కాంట్రాక్టు చేసిన బిల్లులు సుమారు రూ.30 లక్షలు ఆయనకు చెల్లించే విధంగా అనుకూలంగా చేసినందుకు నిందితుడు రూ.15 వేలు లంచం డిమాండ్ చేశారు. దీనిపై కాంట్రాక్టర్ ఫిర్యాదుతో సీబీఐ పోలీసులు వలపన్ని పటు్టు కున్నారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించారు. ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిరికొండ మనోహర్ వాదించారు.
మద్యం తాగొద్దన్నందుకు...


