సమయానికి చికిత్స.. సురక్షిత జీవనశైలి
● హెచ్‌ఐవీతో జీవిస్తున్నవారు
అధైర్యపడవద్దు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
గోస్పాడు: హెచ్‌ఐవీతో జీవిస్తున్న వ్యక్తులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, మందులతో జీవితకాలం పెంపొందించుకోవచ్చని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ‘సమయానికి పరీక్ష , సమయానికి చికిత్స, సురక్షిత జీవనశైలి, ఎయిడ్స్ నివారణకు ప్రధాన ఆయుధాలు’ అని పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ డే – 2025 సందర్భంగా సోమవారం ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాధితులపై ఏ విధమైన వివక్ష, అపోహలు సమాజంలో ఉండకూడదన్నారు. హెచ్‌ఐవి ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స ప్రభావవంతంగా ఉంటుందన్నారు. అనంతరం హెచ్‌ఐవీ బాధితులతో అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ లలిత, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నివారణ అధికారి డాక్టర్ శారదాబాయి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


