చట్టాలపై అవగాహన పెరగాలి
కర్నూలు(అర్బన్): ప్రస్తుత పరిస్థితుల్లో చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమీపంలోని ప్రభుత్వ ఎస్సీ, బీసీ బాలికల వసతిగృహం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి, లీగల్ సర్వీసెస్ కమిటీ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కంటి వైద్యులు డాక్టర్ స్వాతి సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయన మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ బాల్యం, విద్యాబ్యాసం, దేశానికి చేసిన సేవలను వివరించారు. అలాగే విద్యా హక్కు చట్టం, బాలల హక్కులు, పేదరికం, నిరక్షరాస్యత, బాల కార్మిక సమస్య, అక్రమ రవాణా తదితర అంశాలపై ఆయన చట్టపరమైన అవగాహన కల్పించారు. అనంతరం దృష్టి లోపం ఉన్న పిల్లలకు ఉచితంగా కంటి అద్దాలు, మందులను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలోనే వ్యాసరచన, చిత్ర లేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు సర్టిఫికెట్లు, బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ పి.విజయ, డీసీపీఓ టి.శారద, సహాయ సంక్షేమాధికారి బి.మద్దిలేటి, 3వ పట్టణ సీఐ శేషయ్య, వసతి గృహ సంక్షేమాధికారిణులు సులోచన, రజనీ, శైలజ పాల్గొన్నారు.


