పంచాయితీలు చేయడం మీకే చెల్లు చరితమ్మా
కల్లూరు: ఓర్వకల్లు జయరాజ్ కంపెనీని టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేశామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి చెప్పడం హాస్యాస్పదమని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం సల్కాపురం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ పంచాయితీలు చేసి ప్రజల నుంచి ఎవరు డబ్బులు వసూలు చేస్తున్నారో నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుసన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌కు, జయరాజ్ లిమిటెడ్ కంపెనీకి చంద్రబాబు కేవలం టెంకాయ మాత్రమే కొట్టారన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక జయరాజ్ అభివృద్ధికి కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించానన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌కు భూములు కోల్పోయిన రైతుల దగ్గర్నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపించారని, అలాంటి దిగజారుడు పనులు తామెన్నడూ చేయమన్నారు. అధికారుల ట్రాన్స్‌ఫర్‌లు, పాణ్యం నియోజకవర్గ అభివృద్ధిపై చరితమ్మ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. తేదీ, సమయం చెబితే చర్చకు ఎక్కడికై నా వస్తామన్నారు. యాగంటీశ్వరస్వామి దగ్గరకు వెళ్లడానికి మీకు డీజిల్ ఖర్చు అవుతుందేమో, పాణ్యం నియోజకవర్గంలోని కాల్వబుగ్గ ఈశ్వర దేవాలయంలోనైనా ప్రమాణం చేయడానికి తాను సిద్ధమన్నారు. అనంతరం గ్రామానికి చెందిన పలు తెలుగుదేశం పార్టీ కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో కల్లూరు ఎంపీపీ శారద, సర్పంచు మద్దిలేటి, కార్పొరేటర్ లక్ష్మీకాంత రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


