విజయ డెయిరీని కాపాడుకుంటాం
● ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే
గంగుల బిజేంద్రారెడ్డి
ఆళ్లగడ్డ: విజయ డెయిరీని ప్రజాస్వామ్య బద్ధంగా కాపాడుకుంటామని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు వచ్చిన అధికారులు ఇద్దరూ ఆళ్లగడ్డలో అదృశ్యమైన సంఘటనపై శుక్రవారం రాత్రి పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసిన ఆయన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేందుకు వెళ్తున్న ఇద్దరు అధికారులను ఆళ్లగడ్డలో కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేయడం ఎంతవరకు సబబో చెప్పాలని ప్రశ్నించారు. ఉదయం కిడ్నాప్‌కు గురయ్యారని మరో అధికారి చెబుతున్నప్పటికీ రాత్రి వరకు వారి ఆచూకీ తెలుసుకోలేక పోవడం సిగ్గుచేటన్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు వస్తే ఇప్పుడే వారు నంద్యాల ఇంట్లో ఉన్నట్లు ఫోన్‌లో మాట్లాడించడం జరిగిందన్నారు. అయితే ఉదయం నుంచి ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే అన్నారు. ఒక సాధారణ గ్రామీణ డెయిరీ ఎన్నిక జరగకుండా ఏవిధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. డెయిరీ ఏర్పాటు చేసింది రైతుల కోసమని, ప్రభుత్వం మారితే చైర్‌మెన్‌ను మార్పు చేస్తున్నారని అప్పటి టీడీపీ ప్రభుత్వమే మాక్స్ చట్టం తీసుకువచ్చిందన్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్లే దాన్ని తుంగలోకి తొక్కొందుకు యత్నిస్తున్నారన్నారు. అలా జరక్కుండా పోరాటాలు చేసి డెయిరీని కాపాడుకుంటామన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట విజయ డెయిరీ డైరెక్టర్‌లు గంగుల విజయసింహారెడ్డి, పీపీ మధుసూదన్‌రెడ్డి ఉన్నారు.


