ప్రతి పాఠశాలలో శుభ్రత తప్పనిసరి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రతి పాఠశాలలో శుభ్రతను కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి వారి భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. పాఠశాలల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. పచ్చదనం పెంచడానికి విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని, శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను కూల్చి వేతకు చర్యలు తీసుకోవాలన్నారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు రాష్ట్రంలో టాప్ స్థానం దక్కేలా కృషి చేయాలన్నారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వచ్చేనెలలో జరగనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌కు సిద్ధమవ్వాలన్నారు. డీఈఓ జనార్దన్ రెడ్డి, ఎస్‌ఎస్‌ఏ పీఓ ప్రేమాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.


