శ్రీగిరిలో ‘కోటి’ కాంతులు
శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలిసి వెలిసిన శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసం నాలుగో శుక్రవారం రాత్రి దశమి ఘడియల్లో కోటి దీపోత్సవం కనుల పండువగా సాగింది. గంగాధర మండపం వద్ద ఏర్పాటుచేసిన కై లాస పర్వత భారీ వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు. మహాగణపతి పూజ, షోడ శోపచారాది ప్రత్యేక పూజలు నిర్వహించి కోటి దీపోత్సవానికి శ్రీకారం చుట్టారు. తొలుత ధర్మకర్తల మండలి చైర్మన్ రమేష్ నాయుడు, సభ్యులు, దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, అర్చకులు.. వేద మంత్రోచ్ఛారణల మధ్య కోటి దీపోత్సవ ఆరంభ సూచనగా దేవత ఆహ్వాన పూర్వక దీపారాధన వెలిగించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు దశ హారతులుగా ఓంకార, నాగ, త్రిశూల, నంది, సింహ, సూర్య, చంద్ర, కుంభ, నక్షత్ర, కర్పూర హారతులను సమర్పించారు.
దీపారాధనతో దివ్యగుణాలు
శ్రీశైల క్షేత్రం– కోటి దీపోత్సవంపై సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ దివ్య ప్రవచనాలను వినిపించారు. వైదిక సంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, దీపజ్యోతిని యజ్ఞాగ్నికి సంకేతంగా చెబుతారని ఆయన తన ప్రవచనంలో పేర్కొన్నారు. ఉత్సాహం, ఆనందం, శాంతి మొదలైన వాటికి దీపాన్ని ప్రత్యేకంగా భావిస్తారని, దీపారాధనతో దివ్య గుణాలను పొందవచ్చు నని వివరించారు. పరమేశ్వరునికి దీపజ్యోతిని సమర్పిస్తే శుభాలు కలుగుతాయన్నారు.
భక్తజన సంద్రం
గంగాధర మండపం నుంచి నందిమండపం పురవీధిలో కోటి దీపోత్సవం కోసం ప్రత్యేకంగా చిన్నపాటి వేదికలను ఏర్పాటు చేశారు. దానిపై 365 వత్తులతో కూడిన ప్రమిదలను ఒక క్రమ పద్ధతిలో అమర్చారు. కోటి దీపోత్సవంలో పాల్గొనే భక్తులను ముందస్తుగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో వేలాది మంది ఆధార్ కార్డుల తో తమ పేర్లను నమోదు చేసుకొని కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవ కాంతుల మధ్య దశ హారతుల వీక్షణతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందానికి లోనయ్యారు.
శ్రీశైలంలో వైభవంగా
కోటి దీపోత్సవం
కై లాస పర్వత భారీ సెట్టింగ్
ప్రధాన పురవీధుల్లో
ప్రజ్వరిల్లిన కోటి కార్తీక దీపాలు
కార్తీక మాస దశమి ఘడియలలో
భక్తులకు దివ్య అనుభూతి
శ్రీగిరిలో ‘కోటి’ కాంతులు
శ్రీగిరిలో ‘కోటి’ కాంతులు


